ఉద్యోగులే బాస్‌.. అన్‌ అకాడమీ నుంచి ఈఎస్‌ఓపీ

5 Sep, 2021 16:03 IST|Sakshi

తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకు ఎడ్యుటెక్‌ సంస్థ అన్‌ అకాడమీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. సంస్థలో పని చేసే ఉద్యోగులతో పాటు అధ్యాపకులకు మొత్తంగా 10.5 మిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను ఎంప్లాయిస్‌ స్టాక్‌ ఓనర్‌షిప్‌ ప్లాన్‌ కింది ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్‌అకాడమీ సంస్థ సహా వ్యవస్థాపకుడు రోమన్‌ షైనీ ట్వీట్‌ చేశారు. విద్యను అందరికి అందివ్వాలనే లక్ష్యంతో మేము చేసిన ప్రయత్నాలకు సహాకరించిన అందరికీ ధన్యవాదాలు, మా సంస్థ తరఫున ఉద్యోగులకు ఎంప్లాయిస్‌ స్టాక్‌ ఓనర్‌షిప్‌ ప్లాన్‌ (ఈఎస్‌ఓపీ) వర్తింప చేయడం ఇది నాలుగో సారి అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

300ల మందికి
బెంగళూరు వేదికగా ప్రారంభమైన అన్‌అకాడమీ స్టార్టప్‌ అంచెలంచెలుగా ఎదిగింది. ప్రస్తుతం ఈఎస్‌ఓపీకి అర్హులుగా 300ల మంది వరకు అధ్యాపకులు, టీచర్లు అర్హత సాధించినట్టు అన్‌ అకాడమీ తెలిపింది. గత నాలుగైదేళ్లుగా వీరంతా అన్‌ అకాడమీ సంస్థ అభివృద్ది కోసం పాటు పడ్డారని, అందుకే సంస్థలో వాళ్లకు భాగస్వామ్యం కల్పిస్తున్నట్టు అన్‌అకాడమీ తెలిపింది. 

ఎడ్యుటెక్‌గా 
స్కూలు పిల్లలకు ట్యూషన్లు చెప్పడం దగ్గర నుంచి మెడికల్‌, ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌, సివిల్‌ సర్వీస్‌ పరీక్షల వరకు అనేక రకాలుగా అన్‌అకాడమీ ఎడ్యుటెక్‌ సంస్థగా సేవలు అందిస్తోంది. ప్రస్తుతం అన్‌ అకాడమీ సంస్థ మార్కెట్‌ వ్యాల్యూ 3.4 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.

చదవండి : భారీగా పుట్టుకొస్తున్న సాస్‌ స్టార్టప్‌లు, ఐపీఓకి జోష్‌

మరిన్ని వార్తలు