అదిరిపోయిన హైస్పీడ్ స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైకులు..!

22 Feb, 2022 18:39 IST|Sakshi

దేశంలో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు వేగంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, స్టార్ట్అప్ కంపెనీలు కూడా దిగ్గజ కంపెనీలతో పోటీగా కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేస్తున్నాయి. ఇంధన ధరలు భారీగా పెరగడం, ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండటం చేత ప్రజలు ఈవీలను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ప్రజలు ఇప్పుడు తక్కువ ధర ట్యాగ్ కాకుండా మంచి పనితీరు కనబరిచే ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఎదురుచూస్తున్నారు.

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రధాన ఎలక్ట్రిక్ ద్విచక్ర కంపెనీలు మంచి పనితీరు గల ఎలక్ట్రిక్ బైకులను తీసుకొచ్చేందుకు సిద్ద పడుతున్నాయి. త్వరలో రానున్న మంచి పనితీరు గల  హైపర్ స్పీడ్ స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైకుల గురుంచి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1. ట్రూవ్ మోటార్స్ హైపర్ స్పోర్ట్స్
ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్ బైకును త్వరలో తయారు చేయడం ప్రారంభించనున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ 2023 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. సుమారు 350-500 కిలోమీటర్ల పరిధితో గంటకు 200 కిలోమీటర్ల వేగాన్ని చేరుకునేలా ఈ బైక్ రూపొందించినట్లు ట్రూవ్ మోటార్ కంపెనీ తెలియజేసింది.
 

2. అల్ట్రావయొలెట్ ఎఫ్77
టీవీసీ కంపెనీ మద్దతు గల అల్ట్రావయొలెట్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ అల్ట్రావయొలెట్ ఎఫ్77ను 2022 తొలి త్రైమాసికంలో భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ అల్ట్రావయొలెట్ ఎఫ్77 బైక్ 7.5 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 140 కిలోమీటర్ల వేగం అని ఆటోమేకర్ పేర్కొంది. ఇందులో 3 లిథియం-అయాన్ బ్యాటరీలు ఉన్నాయి, 150 కిలోమీటర్ల రేంజ్ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.
 

3. ఎంఫ్లక్స్ వన్ 
ఎంఫ్లక్స్ ఈ ఏడాది తన హైపర్ స్పీడ్ ఎలక్ట్రిక్ బైకును లాంఛ్ చేయాలని చూస్తుంది. ఈ బైక్ గంటకు 200 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుందని, 3 సెకన్లలో గంటకు 0-100 కిలోమీటర్లు చేరుకొనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ బైక్ 200 కిలోమీటర్ల రేంజ్ కూడా అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

4. హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఈ ఈవీ తయారీసంస్థ హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మొదటి స్వదేశీ హైపర్ స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ హాప్ ఆక్సోను అతి త్వరలో లాంఛ్ చేయాలని చూస్తోంది. కంపెనీ ఇటీవల జైపూర్'లో తన తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. రాబోయే హైస్పీడ్ మోటార్ సైకిల్ ఇక్కడ ఉత్పత్తి చేయనుంది. హైపర్ స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ హాప్ ఆక్సో 130-150 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. 10 సెకన్ల కంటే తక్కువ సమయంలో గంటకు 80/90 కిలోమీటర్లకు చేరుకోగలదని కంపెనీ పేర్కొంది.

(చదవండి: బంగారం కొనేవారికి షాక్.. భారీగా పెరిగిన ధరలు..!)

మరిన్ని వార్తలు