IPL 2022: బీసీసీఐకి స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకున్న సురేశ్ రైనా 

22 Feb, 2022 18:38 IST|Sakshi

Suresh Raina: ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ ప్లేయ‌ర్  సురేశ్ రైనాను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆస‌క్తి క‌న‌బ‌ర్చ‌ని విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అత‌ను భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ఓ స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఐపీఎల్‌లో ఆడే అవ‌కాశం ద‌క్క‌ని భారత ఆటగాళ్లకు ఇతర దేశాల క్రికెట్ లీగ్స్‌లో ఆడే అనుమతి ఇవ్వాలంటూ విజ్ఞ‌ప్తి చేశాడు. 


బీసీసీఐ నిబంధ‌న‌ల ప్రకారం బోర్డు కాంట్రాక్టు కలిగిన పురుష క్రికెటర్లు బిగ్ బాష్ లీగ్(బీబీఎల్), కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) వంటి వీదేశీ లీగ్స్ ఆడేందుకు అనుమ‌తి లేదు. భారత్‌లో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల‌కు గుడ్ బై చెబితేనే ఇతర దేశాల లీగ్‌లు ఆడే అనుమ‌తి వారికి ల‌భిస్తుంది. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనితో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన‌ రైనా.. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ టోర్నీలు ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే అతనికి విదేశీ లీగ్‌లు ఆడే అవకాశం లేకుండా పోయింది. 

గతంలోనూ రైనా ఇదే త‌ర‌హా వాద‌న వినిపించిన‌ప్ప‌టికీ బీసీసీఐ అత‌ని వాద‌న‌ను కొట్టిపారేసింది. తాజాగా, భార‌త క్రికెట‌ర్లు విదేశీ లీగ్‌లు ఆడే అనుమ‌తివ్వాలంటూ రైనా మ‌రోసారి గ‌ళం విప్పాడు. రైనా.. విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు బీసీసీఐని అభ్య‌ర్ధిస్తున్న వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైరల‌వుతోంది. ఇదిలా ఉంటే, రూ.2 కోట్ల కనీస ధరతో ఐపీఎల్ 2022 మెగా వేలం బ‌రిలో నిలిచిన రైనాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడంతో అమ్మ‌డుపోని ఆట‌గాడిగా మిగిలిపోయాడు. మిస్ట‌ర్ ఐపీఎల్‌గా పేరొందిన రైనా తన ఐపీఎల్ కెరీర్‌లో 205 మ్యాచ్‌లు ఆడి 30కి పైగా స‌గ‌టుతో 5528 ప‌రుగులు చేశాడు. 
చ‌ద‌వండి: IPL 2022 Auction: రైనా.. ధోని న‌మ్మ‌కాన్ని కోల్పోయాడు, అందుకే ఈ పరిస్థితి..!

మరిన్ని వార్తలు