వాహన రుణాలు రూ.5.09 లక్షల కోట్లు

13 Jul, 2023 05:24 IST|Sakshi

మే నాటికి వసూలు కావాల్సిన మొత్తం

ఏడాదిలో 22 శాతం పెరుగుదల

వ్యక్తిగత వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌

న్యూఢిల్లీ: వ్యవస్థలో మొత్తం వాహన రుణాలు మే నాటికి రూ.5.09 లక్షల కోట్లకు చేరాయి. క్రితం ఏడాది మే నాటికి ఉన్న రూ.4.16 లక్షల కోట్లతో పోలిస్తే ఏడాదిలో 22 శాతం పెరిగాయి. 2021 మే నాటికి ఈ మొత్తం రూ.3.65 లక్షల కోట్లుగా ఉండడం గమనించొచ్చు. అంతకుముందు ఏడాది కంటే గతేడాది వాహన రుణాలు ఎక్కువగా వృద్ధి చెందాయి. ఆర్‌బీఐ గతేడాది మే నుంచి వడ్డీ రేట్లను క్రమంగా సవరించడం మొదలు పెట్టి, ఈ ఏడాది ఫిబ్రవరిరి వరకు మొత్తం మీద 2.5 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. అయినప్పటికీ వాహన విక్రయాలు పెద్ద ఎత్తున పెరగడం వాహన రుణాలకు సైతం డిమాండ్‌ను తీసుకొచి్చంది.

ఈ ఏడాది జూన్‌కు సంబంధించి ఆటోమొబైల్‌ డీలర్ల సమాఖ్య విడుదల చేసిన గణాంకాలను పరిశీలించినా, అన్ని విభాగాల్లో వాహన విక్రయాలు పెరిగినట్టు తెలుస్తోంది. ఆటో రిటైల్‌ విక్రయాలు 10 శాతం మేర పెరిగాయి. ప్యాసింజర్‌ వాహనాలకు డిమాండ్‌ బలంగా ఉన్నట్టు రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా లిమిటెడ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రోహన్‌ కన్వార్‌ గుప్తా తెలిపారు. కార్ల ధరలు, రుణాల రేట్లు పెరిగినప్పటికీ వాహన డిమాండ్‌ ఆరోగ్యంగా ఉన్నట్టు పేర్కొన్నా రు. అయితే కారు కొనుగోలు వ్యయం పెరిగినందున వాహన విచారణలు, విక్రయాల గణాంకాలు సమీప కాలానికి ఎలా ఉంటాయో పర్యవేక్షించాల్సి ఉందన్నారు. సెమీకండక్టర్‌ సరఫరా కొంత స్థిరపడినప్పటికీ, ఇక ముందూ సరఫరా పరంగా కొరత ఓఈఎంలను ఆందోళనకు గురి చేయవచ్చని గుప్తా అభిప్రాయం వ్యక్తం చేశారు.

పెరుగుతున్న ఆదాయాలు  
ఆకాంక్షలు పెరగడం, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధి వల్ల కార్లకు డిమాండ్‌ను తీసుకొస్తున్నట్టు ఆండ్రోమెడా సేల్స్, ఆప్నాపైసా ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ వి.స్వామినాథన్‌ వివరించారు. ఆధునిక డిజైన్, ఫీచర్లతో నూతన కార్లను విడుదల చేస్తుండడంతో వీటి ధరల్లోనూ పెరుగుదల కనిపిస్తున్నట్టు చెప్పారు. కార్ల రుణాలకు ఎంతో ఆదరణ కనిపిస్తోందని, సగటు వాహన రుణం మొత్తం కూడా పెరిగినట్టు తెలిపారు. ‘‘ఆర్థిక వ్యవస్థ సంఘటితం వైపు అడుగులు వేస్తుండడం, ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వ్యక్తుల సంఖ్య పెరుగుతుండడంతో, అది వారి రుణ అర్హతను ఇతోధికం చేస్తుంది. దీనికి అదనంగా రుణ లభ్యతను ఫిన్‌టెక్‌ కంపెనీలు మరింత సులభతరం చేస్తున్నాయి. దీంతో వ్యక్తులు సులభంగా రుణాలు పొందేలా చేస్తోంది’’ అని స్వామినాథన్‌ వివరించారు. దేశవ్యాప్తంగా రుతుపవనాల విస్తరణతో, సాధారణ వర్షపాతం అంచనాలు, ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాతో ఆర్థిక వృద్ధి మెరుగ్గా ఉంటుందని, ఇది ఆటో విక్రయాలకు మేలు చేస్తుందని పరిశ్రమ భావిస్తోంది.

మరిన్ని వార్తలు