జూమ్‌ మీటింగ్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రకటన.. విమర్శలపై సీఈవో స్పందన

9 Dec, 2021 09:12 IST|Sakshi

Better.com CEO Apology For Laying Off 900 Employees Via Zoom Call: జూమ్‌ మీటింగ్‌ వేదికగా 900 మంది ఉద్యోగుల్ని ఒకేసారి తొలగించిన ఘటన విమర్శలకు దారితీయడంతో బెటర్‌ డాట్‌ కామ్‌ సీఈవో విశాల్‌ గార్గ్‌ ఎట్టకేలకు స్పందించాడు.
 

భారత సంతతికి చెందిన విశాల్‌ గార్గ్‌.. బెటర్‌ డాట్‌ కామ్‌. అనే మోర్టగేజ్‌ లెండింగ్‌ కంపెనీకి సీఈవో. గత ఏడాది నవంబర్ నెలలో వ్యాపార పత్రిక ఫోర్బ్స్ లో స్థానం సంపాదించుకున్నాడాయన.  అయితే కిందటి వారం జూమ్‌ మీటింగ్‌లో ఆయన వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. సమావేశం జరుగుతుండగా.. ఒక్కసారిగా ఒకేసారి 900 ఎంప్లాయిస్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో షాక్‌ అవ్వడం ఉద్యోగుల వంతు అయ్యింది.  


ఆన్‌లైన్‌లో అదీ జూమ్‌ కాల్‌లో ఉండగా.. ఉద్యోగులకు అలాంటి షాక్‌ ఇవ్వడంపై విశాల్‌ తీరును చాలామంది తప్పుబట్టారు. ఓ ఉద్యోగి ద్వారా తొలింపునకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యింది కూడా. ఇక  ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా లాంటి వాళ్లు సైతం ఇది పూర్తిగా తప్పు అంటూ అభిప్రాయం వెలిబుచ్చారు. విమర్శలు తారాస్థాయికి చేరడంతో విశాల్‌ గార్గే బహిరంగ లేఖ ద్వారా తొలగించిన ఉద్యోగులకు క్షమాపణలు తెలియజేశారు. 

అలా తొలగిస్తున్నట్లు ప్రకటించడాన్ని తప్పిదంగా పేర్కొంటూ క్షమాపణలు చెప్పాడు విశాల్‌ గార్గ్‌. ‘నేను ఇలా ప్రవర్తించిన తీరు వార్తల్లోకి ఎక్కడం పరిస్థితిని ఇంకా ఘోరంగా మార్చేసింది’ అంటూ లేఖలో పేర్కొన్నాడు. మార్కెట్‌, పర్‌ఫార్మెన్స్‌, ప్రొడక్టివిటీ.. ఉద్యోగుల తొలగింపునకు కారణాలని స్పష్టత ఇచ్చాడు. తాను వ్యక్తిగతంగా ఉద్యోగులకు ఈ విషయం తెలియజేయాల్సి ఉండొచ్చని.. కానీ, అలా ఆన్‌లైన్‌లో ప్రకటించి వాళ్ల మనసు నొప్పించినందుకు క్షమించాలని గార్గ్‌ తన ప్రకటనలో పేర్కొన్నాడు. 

ఇదిలా 2016లో న్యూయార్క్‌ కేంద్రంగా బెటర్‌ డాట్‌ కామ్‌ సేవల్ని ప్రారంభించింది. అయితే ఈ మే నెలలోనే కంపెనీ ఐపీవోకు వెళ్తుందని సంకేతాలు ఇవ్వడంతో పాటు ఈ నెల మొదట్లో సాఫ్ట్‌బ్యాంక్‌తో హడావిడి ఒప్పందం కూడా ముగించింది. ఇదిలా ఉంటే 750 మిలియన్‌ డాలర్ల సేకరణ తర్వాత కంపెనీ.. ఇలా 9 శాతం ఉద్యోగుల్ని తొలగించడంతో బెటర్‌ డాట్‌ కామ్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు