కొత్త నిబంధన.. ఆ ఆన్‌లైన్‌ లావాదేవీలకు 4 గంటలు ఆగాల్సిందే..!

29 Nov, 2023 07:34 IST|Sakshi

ఆన్‌లైన్‌ లావాదేవీల్లో జరుగుతున్న మోసాల గురించి ఎక్కడోచోట చూస్తూంటాం. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్నో నిబంధనలు తీసుకొస్తోంది. తాజాగా మరో కొత్త నిబంధనను అమలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇద్దరు వ్యక్తుల మధ్య తొలిసారి యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ద్వారా జరిగే లావాదేవీల్లో.. రూ.2,000 లోపు అయితే వెంటనే  పేమెంట్‌ అవుతుంది. తొలి లావాదేవీలో అంతకుమించి డబ్బు పంపాలంటే కనీసం 4 గంటల వ్యవధి ఉండేలా చూడాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2022-23 సంవత్సరానికిగాను విడుదల చేసిన నివేదికలో మొత్తం 13,530 ఆన్‌లైన్‌ మోసాలు నమోదైనట్లు తెలిపింది. వీటి మొత్తం విలువ రూ.30,252 కోట్లు. ఇందులో 49 శాతం మోసాలు ఆన్‌లైన్‌ చెల్లింపులకు సంబంధించినవే. ఆన్‌లైన్‌ మోసాలను మరింత సమర్థంగా అడ్డుకునేందుకు.. ఇద్దరు వ్యక్తుల మధ్య తొలి విడతలోనే రూ.2,000కు మించి ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేయాలంటే.. కనీసం 4 గంటల వ్యవధి ఉండేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతకు మించి చెల్లించినప్పుడు.. ఆ నాలుగు గంటల వ్యవధిలో వినియోగదారుడు లావాదేవీని రద్దు చేసుకోవచ్చు, లేదా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా మోసాలను సులభంగా అడ్డుకోవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తోంది. యూపీఐ లావాదేవీలకే కాకుండా.. ఇమ్మీడియట్‌ పేమెంట్‌ సర్వీస్‌ (ఐఎంపీఎస్‌), రియల్‌ టైం గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ (ఆర్‌టీజీఎస్‌) లావాదేవీలకూ ఈ షరతును వర్తింపచేయాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. 

ఇదీ చదవండి: అద్దెకు ఆమె సగం మంచం.. నెలకు రెంట్‌ ఎంతంటే..?

ప్రస్తుత నిబంధనల ప్రకారం తొలిసారి యూపీఐ లావాదేవీని నిర్వహించే వారు 24 గంటల వ్యవధిలో రూ.5,000 మించి చేయడానికి వీలుకాదు. నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (నెఫ్ట్‌) లావాదేవీల్లో ఒకసారి అవతలి వ్యక్తిని రిజిస్ట్రేషన్‌ చేసిన తర్వాత, 24 గంటల పాటు రూ.50,000 వరకే బదిలీ చేసే వీలుంటుంది.

మరిన్ని వార్తలు