వడ్డీరేట్లు పెరుగుతాయా?

11 Jan, 2021 10:22 IST|Sakshi

కరోనా కల్లోలం కారణంగా ఈక్విటీ ఫండ్స్‌ నుంచి నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బ్యాంకింగ్, పీఎస్‌యూ, షార్ట్‌ టర్మ్‌ బాండ్‌ ఫండ్స్‌కు మళ్లించాను. ఈ ఏడాది మార్చి తర్వాత వడ్డీరేట్లు పెరుగుతాయనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో సమంజసమైన రాబడులు రావాలంటే నేను ఏ రకమైన ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి? –స్రవంతి

సాక్షి, హైదరాబాద్‌:   హైదరాబాద్‌ భవిష్యత్తును ముందుగానే అంచనా వేయడం కష్టం. అలాగే వడ్డీరేట్ల గమనం ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. వడ్డీరేట్లు తగ్గుతాయని, లేదు పెరుగుతాయని ఎవరికి వారు బలమైన వాదనలతో ఇన్వెస్టర్లను గందరగోళ పరుస్తున్నారు. అవసరాన్ని బట్టి రేట్లపై నిర్ణయాలు తీసుకుంటామని ఆర్‌బీఐ అంటోంది. బహుశా ఈ విధానం వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగే అవకాశాలున్నాయి. మరోవైపు ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరిగిపోతోంది. ఆర్థిక వృద్ధి కూడా మెరుగుపడుతోంది. ఇన్ని అంశాల మధ్య వడ్డీరేట్ల తీరు ఎలా ఉంటుందో అంచనాలు వేయడం కొంచెం కష్టమైన విషయమే. అందుకని ఏ ఇన్వెస్టరైనా తన నియంత్రణలో లేని ఇలాంటి విషయాల కంటే తన నియంత్రణలో ఉండే ఇతర విషయాలపైననే దృష్టి సారించాలి. మీ ఆర్థిక లక్ష్యాలు ఏమిటి? ప్రస్తుతమున్న ఆర్థిక అవసరాలు ? మీరు ఎంత కాలం ఇన్వెస్ట్‌ చేయగలరు. ఇప్పుడు మీకు ఉన్న ఆదాయ, వ్యయ వివరాలు....ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఏ విధమైన ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలో నిర్ణయాలు తీసుకోండి. సాధారణంగా పిల్లల ఉన్నత చదువులు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం తదితర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం దీర్ఘకాలం (కనీసం ఏడేళ్లు... అంతకు మించి)ఇన్వెస్ట్‌ చేయడానికి ఈక్విటీ ఫండ్స్‌ను మించిన ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనం మరొకటిలేదు.

ఇన్‌కమ్‌ పోర్ట్‌ఫోలియోల్లో ఈక్విటీ ఫండ్స్‌ కూడా ఉండాల్సిందేనని మితృలంటున్నారు. అది సరైనదేనా?
–వివేక్, విశాఖపట్టణం

ఒక ఇన్వెస్టర్‌ ఇన్‌కమ్‌ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ ఫండ్స్‌ తప్పనిసరిగా ఉండాల్సిందే. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాల కంటే ఈక్విటీ సాధనాలే మెరుగైన రాబడులు ఇస్తాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి తన అవసరాలకు ఫిక్స్‌డ్‌–ఇన్‌కమ్‌ ఆధారిత పోర్ట్‌ఫోలియోపైననే ఆధారపడి ఉంటాడనుకుందాం. నెలకు రూ.50,000 వచ్చేట్లుగా ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేశాడనుకుందాం. ప్రస్తుతానికి ఈ రూ.50,000 మొత్తం ఆ వ్యక్తి అవసరాలకు సరిపోతుంది. ఐదేళ్ల తర్వాత చూసుకుంటే, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. వస్తు, సేవల ధరలు కూడా పెరుగుతాయి. అప్పుడు ఈ 50,000 సరిపోవు. ఈ రాబడిని పెంచుకోవలసి ఉంటుంది.

పూర్తిగా స్థిరాదాయ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసే రాబడులు పొందే వ్యక్తి..... పెరుగుతున్న ధరలతో సమానమైన రాబడులను పొందలేడు. అందుకని ఆ వ్యక్తి పోర్ట్‌ఫోలియోలో తప్పనిసరిగా ఈక్విటీ ఫండ్స్‌ ఉండాల్సిందే. ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను పొందవచ్చు. ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాలతో ఈక్విటీ ఫండ్స్‌ను కూడా కలిపితే మంచిది. ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ విభాగం నిలకడైన రాబడిని ఇస్తుంది. ఇక ఈక్విటీ పోర్ట్‌ఫోలియో ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులనిస్తుంది.

మరిన్ని వార్తలు