ప్రపంచంలోనే ఖరీదైన కాయిన్‌.. కిలోలకొద్దీ బంగారం, వజ్రాలు.. చూస్తే కళ్లు చెదరాల్సిందే!

9 Sep, 2023 12:23 IST|Sakshi

World's Most Expensive Coin: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాయిన్‌ను బ్రిటన్‌లో ఆవిష్కరించారు. దివంగత క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth 2) గౌరవార్థం ఈ నాణేన్ని రూపొందించారు. ఇది అన్ని కాలాలలో అత్యంత విలువైనదని భావిస్తున్నారు. దాదాపు 4 కిలోల బంగారం (Gold), 6,400 కంటే ఎక్కువ వజ్రాలతో (Diamonds) తయారు చేసిన ఈ నాణెం విలువ సుమారు 23 మిలియన్‌ డాలర్లు (రూ.192 కోట్లు) అని  సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థ నివేదించింది.

(Birmingham bankrupt: బ్రిటన్‌లో సంచలనం.. దివాలా తీసిన ప్రముఖ నగరం!) 

లగ్జరీ లైఫ్ స్టైల్ బ్రాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తయారు చేసిన ఈ నాణేన్ని క్వీన్ ఎలిజబెత్-2 మొదటి వర్ధంతి సందర్భంగా విడుదల చేశారు. కామన్వెల్త్‌ దేశాల్లోని హస్తకళాకారులు 16 నెలలపాటు శ్రమించి దీన్ని తయారు చేశారు. దీన్ని మరింత ఘనంగా రూపొంచాలనుకున్నా వజ్రాల కొరత కారణంగా సాధ్యం కాలేదు.

స్కై న్యూస్ ప్రకారం.. 9.6 అంగుళాల కంటే ఎక్కువ వ్యాసం కలిగిన ఈ నాణెం బాస్కెట్‌బాల్ పరిమాణంలో ఉంది. దీనిపై ప్రఖ్యాత పోర్ట్రెయిట్ కళాకారులు మేరీ గిల్లిక్, ఆర్నాల్డ్ మచిన్, రాఫెల్ మక్లౌఫ్,  ఇయాన్ ర్యాంక్-బ్రాడ్లీలు దివంగత చక్రవర్తి చిత్రాలను తీర్చిదిద్దారు. దీని మధ్య భాగంలో అమర్చిన నాణెం 2 పౌండ్లపైగా బరువుంటుంది. చుట్టూ ఉన్న చిన్న నాణేలు ఒక్కొక్కటి ఒక ఔన్స్ బరువు కలిగి ఉంటాయి. నాణెం అంచుల్లో క్వీన్‌ సూక్తులను ముద్రించారు. 

2021 జూన్ లో సోథెబైస్ న్యూయార్క్‌లో 18.9 మిలియన్‌ డాలర్లు పలికిన అరుదైన 1933 యూఎస్‌  "డబుల్ ఈగిల్" నాణెమే ఇప్పటి వరకు వేలంలో విక్రయించిన అత్యంత ఖరీదైనది. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్ట్‌లో నమోదైంది.

మరిన్ని వార్తలు