యూట్యూబ్‌తో రూ. 10 వేల కోట్లు.. 7.5 లక్షల పైగా ఉద్యోగాలు!

21 Dec, 2022 12:36 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్‌ వ్యవస్థ 2021లో భారత స్థూల దేశీయోత్పత్తికి (జీడీపీ) ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ. 10,000 కోట్ల పైగా తోడ్పాటు అందించింది. అలాగే, 7.5 లక్షల పైచిలుకు ఫుల్‌టైమ్‌ కొలువులకు సమానమైన ఉద్యోగాలను కల్పించింది. ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ రూపొందించిన యూట్యూబ్‌ ప్రభావ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌లో 4,500 పైగా ఛానల్స్‌కు 10 లక్షలకు మించి సబ్‌స్క్రయిబర్స్‌ ఉన్నారు. వార్షికంగా రూ. 1 లక్షకు పైగా ఆదాయం ఆర్జిస్తున్న ఛానల్స్‌ సంఖ్య వార్షిక ప్రాతిపదికన 2021లో 60 శాతం పైగా పెరిగింది.

యూట్యూబ్‌ ప్రభావంపై ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ నిర్వహించిన సర్వేలో 4,021 యూట్యూబ్‌ యూజర్లు, 5,633 మంది క్రియేటర్లు, 523 వ్యాపార సంస్థలు పాల్గొన్నాయి. నివేదిక ప్రకారం ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఇద్దరు యూజర్లలో ఒకరు తమ కెరియర్‌కు ఉపయోగపడే నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు యూట్యూబ్‌ను ఉపయోగిస్తున్నారు. అలాగే కొత్తగా ఉద్యోగాలను దక్కించుకోవాలనుకునే యూజర్లలో 45 శాతం మంది, వాటికి అవసరమైన నైపుణ్యాలను సాధించుకునేందుకు యూట్యూబ్‌ను ఉపయోగిస్తున్నారు. ‘యూట్యూబ్‌ను సాంప్రదాయ విద్యాభ్యాసానికి అదనంగా ఒక ప్రయోజనకరమైన సాధనంగా విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పరిగణించే ధోరణి పెరుగుతోంది. యూట్యూబ్‌తో పిల్లలు సరదాగా నేర్చుకుంటున్నారని దాన్ని ఉపయోగించే పేరెంట్స్‌లో 83 శాతం మంది తెలిపారు. విద్యార్థులు నేర్చుకునేందుకు ఇది సహాయకరంగా ఉంటోందని యూట్యూబ్‌ను ఉపయోగించే 76 శాతం మంది అధ్యాపకులు తెలిపారు‘ అని నివేదిక వివరించింది.  

మహిళల ఆసక్తి: పర్సనల్‌ ఫైనాన్స్‌ గురించి తెలుసుకోవడం మొదలుకుని స్ఫూర్తినిచ్చే సలహాలు పొందేందుకు, తమ హాబీలను ఆదాయ వనరుగా మార్చుకునేందుకు, కెరియర్‌.. వ్యాపారాలను నిర్మించుకోవడం వరకు ఇలా తమ జీవితానికి తోడ్పడే ఎన్నో అంశాలు నేర్చుకునేందుకు మహిళలు యూట్యూబ్‌ని ఎంచుకుంటున్నారు. జీవితకాల అభ్యాసానికి యూట్యూబ్‌ ఎంతో ఉపయోగకరమైన ప్లాట్‌ఫాం అని 77 శాతం మంది మహిళలు తెలిపారు. ప్రతి రోజూ ఉపయోగపడే నైపుణ్యాలను నేర్చుకునేందుకు ఇది సహాయకరంగా ఉంటోందని 56 శాతం మంది, తమ ఆకాంక్షలు .. ఐడియాలను పంచుకోవడంలో సహాయపడుతోందని 90 శాతం మంది మహిళా క్రియేటర్లు వివరించారు.

చదవండి: న్యూ ఇయర్‌ ముందు.. కస్టమర్లకు షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ!

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు