AI warning: బ్యాంకులకూ ముప్పు తప్పదా? హెచ్చరిస్తున్న జెరోధా సీఈవో నితిన్‌ కామత్‌ 

14 Dec, 2023 09:27 IST|Sakshi

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో  బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ముప్పు పొంచి ఉందా..  విస్తృతమవుతున్న డీప్‌ ఫేక్‌లు బ్యాంకులనూ బురిడీ కొట్టిస్తాయా? అవుననే హెచ్చరిస్తున్నారు ప్రముఖ స్టాక్‌ బ్రోకరేజీ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ కామత్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో బ్యాంకులకు  ఎదురుకానున్న సమస్యలను తెలియజేస్తూ ఆయనో వీడియో పోస్ట్‌ చేశారు. 

ప్రస్తుతం ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వాడకం విస్తృతమైంది. ఈ క్రమంలోనే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కూడా ఈ టెక్నాలజీని తమ కార్యకలాపాల కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి.  అయితే ఏఐ టెక్నాలజీని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు. సెలబ్రిటీల డీప్‌ ఫేక్‌లు సృష్టిస్తున్నారు. ఇది ఇక్కడికే పరిమితం కాదని, పెరుగుతున్న ముప్పును హైలైట్ చేస్తూ నితిన్‌ కామత్‌ ‘ఎక్స్‌’లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. డీప్‌ఫేక్ కస్టమర్ గుర్తింపులను ధ్రువీకరించడంలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి తెలియజేశారు. 

నిజమా.. ఏఐ కల్పితమా?
ప్రస్తుతం కస్టమర్లు నేరుగా బ్యాంకులకు, కార్యాలయాలకు వెళ్లడం తగ్గిపోయింది. అన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. ప్రస్తుతం బ్యాంకులు డిజిలాకర్ లేదా ఆధార్‌ని ఉపయోగించి కస్టమర్ల ఐడీ, అడ్రస్ ప్రూఫ్ డేటాను బ్యాంకులు పొందుతున్నాయి. ఇక ఖాతాను తెరిచే వ్యక్తితో ఈ ఐడీని వెబ్‌క్యామ్ ద్వారా నిర్ధారించుకుంటున్నాయి. అయితే డీప్‌ఫేక్‌లు పెరుగుతున్న కొద్దీ అవతలి వైపు ఉన్న వ్యక్తి నిజమా లేదా ఏఐ కల్పితమా అన్నది ధ్రువీకరించడం కష్టమవుతుందని తాను భావిస్తున్నట్లు నితిన్‌ కామత్‌ పేర్కొన్నారు.  ఆన్‌బోర్డింగ్ సమయంలో మరింత కఠినమైన నియంత్రణ అవసరాలు ఉన్న బ్యాంకులకు ఈ సమస్య మరింత పెద్దదిగా మారుతుందన్నారు.

ఇది కూడా చదవండి: మస్క్‌ వారి మరమనిషి మరింత కొత్తగా.. టెస్లా రోబో 2.0!

 ఈ ముప్పును అధిగమించడానికి రానున్న రోజుల్లో ఎలాంటి నిబంధనలు రూపొందిస్తారు.. ఖాతాలు తెరవాలంటే నేరుగా బ్యాంకులకే వెళ్లాల్సిన రోజులు మళ్లీ వస్తాయా అన్నది చూడాలి. వీడియో చివరిలో నితిన్‌ కామత్‌ ‘ఇక్కడ ఉన్నది నేను కాదు.. ఇది డీప్‌ ఫేక్‌’ అంటూ చమత్కరించారు.

>
మరిన్ని వార్తలు