కేంద్రానికి రాజస్థాన్ సర్కార్ షాక్!.. ఇద్దరు ఈడీ అధికారుల అరెస్టు

2 Nov, 2023 15:46 IST|Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరు నడుస్తోంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకుల మీద ఈడీ దాడులు జరుపుతుండగా.. రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థలు కూడా కేంద్రధీటుగా బదులిస్తున్నాయి. తాజాగా కేసు నమోదు వ్యవహారంలో ఇద్దరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు లంచం తీసుకుంటుండగా రాష్ట్ర ఏసీబీ (అవినీతి వ్యతిరేక సంస్థ) అధికారులు అరెస్టు చేశారు. ఓ చిట్‌ ఫండ్‌కు సంబంధించిన ఓ వ్యవహారంలో కేసు నమోదు చేయకుండా ఇద్దరు ఈడీ అధికారులు రూ.15 లక్షల లంచం తీసుకున్నారని ఏసీబీ అధికారులు ఆరోపించారు. వీరిద్దరూ ఆధారాలతో సహా పట్టుబడ్డారని తెలిపారు. 

విదేశీ మారక నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్‌ను ఈడీ అక్టోబర్ 30న తొమ్మిది గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించింది. రాజకీయ కక్షతోనే కేంద్రం ఈడీ దాడులు జరిపిస్తోందని ఆరోపించింది. బీజేపీ హయాంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు విశ్వాసాన్ని కోల్పోయాయని సీఎం గహ్లోత్ అన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఈడీ అధికారులను అరెస్టు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

రాజస్థాన్‌లో నవంబర్ 25న ఎన్నికల జరగనున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న సీఎం అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ.. మరోసారి అధికార పీఠం దక్కించుకోవాలని దూకుడుగా ఉంది. అటు.. ఈసారి తప్పకుండా అధికారం తమదేనని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.  

అటు ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే.. నేడు ఈడీ అధికారుల ముందు ఆయన హాజరుకావాల్సి ఉంది. కానీ ఈడీ సమన్లను వెనక్కి తీసుకోవాలని ప్రత్యుత్తరం రాస్తూ ఈడీ ముందు హాజరుకాలేదు.  

ఇదీ చదవండి: మూడు బ్యాగులతో ఎథిక్స్ కమిటీ ముందు హాజరైన మహువా మెయిత్రా

మరిన్ని వార్తలు