అక్రమంగా దేశంలోకి చొరబాటు.. బంగ్లాదేశీయుల అరెస్ట్‌

4 Jul, 2021 03:27 IST|Sakshi
పోలీసులు అదుపులోకి తీసుకున్న బంగ్లాదేశీయులు

విజయవాడ రైల్వేస్టేషన్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

సాక్షి, అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడ సెంట్రల్‌): పాస్‌పోర్టు లేకుండా దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన నలుగురు బంగ్లాదేశీయులను విజయవాడ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం మేరకు.. బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు వ్యక్తులు మనదేశంలోకి అక్రమంగా ప్రవేశించి రైలులో ప్రయాణం చేస్తున్నట్లుగా కేంద్ర నిఘా విభాగం నుంచి శుక్రవారం విజయవాడ పోలీసులకు సమాచారం అందింది. నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు తన సిబ్బందిని అప్రమత్తం చేశారు.

విజయవాడ రైల్వే స్టేషన్‌కు చేరుకొని ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. హౌరా నుంచి గోవా వెళ్తున్న 08047 నంబర్‌ రైలులోని ఎస్‌–3 బోగీలో అనుమానాస్పదంగా ఉన్న నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు. వారంతా బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్‌ హాసన్‌ (33), హైదర్‌ అలీఖాన్‌ (37), ఇందాదల్‌ ఖాన్‌ (21), షేక్‌ సైఫుల్లా (25)గా పోలీసులు గుర్తించారు. వారిలో మొదటి ముగ్గురు అన్నదమ్ములు కాగా సైఫుల్లా వారికి సమీప బంధువని తేల్చారు. కొన్నేళ్ల క్రితం మహ్మద్‌ హాసన్, హైదర్‌ అలీఖాన్‌లు బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా దేశంలోకి చొరబడి బెంగళూరులో ఇనుప స్క్రాప్‌ షాపులో పనిచేస్తూ ఉండేవారు. 2019లో ఇద్దరూ తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయారు. తిరిగి తమ సోదరుడు ఇందాదల్‌ ఖాన్, బంధువు సైఫుల్లాలను కలుపుకొని గత నెల 30న ఇండియా బోర్డర్‌కు చేరుకున్నారు.

చీకటిపడే వరకు అక్కడే ఉండి అర్ధరాత్రి సమయంలో దేశంలోకి అక్రమంగా ప్రవేశించి హౌరా చేరుకున్నారు. ఓ వ్యక్తి సాయంతో హౌరా నుంచి వాస్కోడిగామాకు ట్రైన్‌ టికెట్‌లను ఏర్పాటు చేయించుకొని ఈనెల ఒకటో తేదీన రైలు ఎక్కి రెండో తేదీన రాత్రి 8 గంటల సమయంలో విజయవాడకు చేరుకున్నారు. అప్పటికే ప్రత్యేక తనిఖీలు చేస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న ఈ నలుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. పాస్‌పోర్టు, అనుమతులు లేకుండా దేశంలోకి అక్రమంగా ప్రవేశించడంతో వారిపై సెక్షన్‌ 467, 468, 120–బీ, సెక్షన్‌ 420, 12(1ఏ, బీ), పాస్‌పోర్ట్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

సమగ్ర దర్యాప్తు
వీరంతా ఉపాధి కోసం దేశంలోకి అక్రమంగా ప్రవేశించారా? లేక ఏదైనా ఉగ్ర కార్యకలాపాల్లో భాగంగా చొరబడ్డారా? అనే కోణాల్లో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం బిహార్‌లో పేలుడుకు రసాయన పదార్థాలన్నీ రైల్లోనే తీసుకెళ్లినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలడం, ఇప్పుడు ఈ నలుగురు బంగ్లాదేశీయులు రైలులోనే ప్రయాణిస్తూ పట్టుబడడంతో ఆర్‌పీఎఫ్, ఇంటెలిజెన్స్, పోలీసు ప్రత్యేక విభాగాలన్నీ మరింత అప్రమత్తమయ్యాయి. పశ్చిమ జోన్‌ లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీ విక్రాంత్‌ పాటిల్‌ పర్యవేక్షణలో నార్త్‌ డివిజన్‌ ఏసీపీ షేక్‌ షాను, సత్యనారాయణపురం ఇన్‌చార్జ్‌ సీఐ లక్ష్మీనారాయణ, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు