మూకుమ్మడిగా కుక్కల దాడి... పోస్టల్‌ ఉద్యోగి మృతి

25 Aug, 2022 11:05 IST|Sakshi

ఫ్లోరిడా: నార్త్‌ ఫ్లోరిడాలో ఒక పోస్టల్‌ ఉద్యోగి కుక్కల దాడిలో మృతి చెందింది. 61 ఏళ్ల పమేలా జేన్‌ రాక్‌ అనే మహిళ తన పోస్టల్‌ ట్రక్కుతో రోడ్డుపై వెళ్తోంది. ఇంతలో ట్రక్కు కదలకుండా మొరాయించడంతో ఆమె వాహనం దిగి సాయం కోసం చూస్తోంది. అంతే ఎక్కడ నుంచి వచ్చాయో ఒక ఐదు కుక్కలు గుంపుగా ఆమెను చుట్టుముట్టి దాడి చేశాయి. దీంతో ఆమె కింద పడిపోయి గట్టిగా పెడబొబ్బలు పెడతూ సాయం కోసం అరుస్తూ ఉంది. ఆమె కేకలు విని చుట్టు పక్కల ఉన్న నివాసితులు, సదరు కుక్కల యజమాని వెంటనే వచ్చి ఆ కుక్కలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.

అందులో భాగంగా ఒక వ్యక్తి తుపాకిని గాల్లో రెండు రౌండ్ల కాల్చాడు కూడా. ఐతే పమేలాకి తీవ్ర గాయాలై రక్త స్రావం అవడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు స్థానికులు.  కానీ ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.  దీంతో జంతు నియంత్రణ సంస్థ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ఐదు కుక్కలను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు చేయడమే కాకుండా సదరు కుక్కుల యజమానిని కూడా విచారిస్తున్నారు. యూఎస్‌ పోస్ట్‌ సర్వీస్‌ విడుదల చేసిన డేటా ప్రకారం 2021లో సుమారు 5 వేల మంది పోస్టల్‌ ఉద్యోగుల పై కుక్కలు దాడి చేశాయని అదికారులు తెలిపారు. కుక్కల యజమానుల తమ కుక్కలను చుట్టుపక్కల వారికి హాని కలిగించకుండా సురక్షితమైన ప్రదేశాల్లో పర్యవేక్షించుకోవాలని సూచించారు అధికారులు.

(చదవండి: దేం సరదా.. అడిగి మరీ అరెస్టయింది!)

మరిన్ని వార్తలు