సంతోష్‌ను చంపింది సోదరుడే..

7 Mar, 2021 12:22 IST|Sakshi

మూసాపేట హత్య కేసును ఛేదించిన పోలీసులు

మూసాపేట: గత నెల జిల్లాలో సంచలనం సృష్టించిన బాలుడు సంతోష్‌ హత్యకేసును పోలీసులు ఛేదించారు. సొంత అన్నే తన తమ్ముడి గొంతుకు తాడు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. సీఐ రజితారెడ్డి, ఎస్‌ఐ పర్వతాలు తెలిపిన కథనం ప్రకారం, మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలంలోని జానంపేటకి చెందిన పుట్ట విష్ణు గద్వాల ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి 22 ఏళ్ల క్రితం అడ్డాకుల మండలం గౌరిదేవునిపల్లికి చెందిన పద్మతో వివాహం కాగా కుటుంబ కలహాలతో దూరమయ్యారు. దీంతో విష్ణు పదేళ్ల క్రితం మహ్మదుస్సేన్‌పల్లికి చెందిన లక్ష్మీని రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య పద్మకు ఒక కూతురు, పదిహేడేళ్ల కుమారుడు.. రెండో భార్య లక్ష్మీకి సంతోష్‌ (8) సంతానం. అయితే, మొదటి భార్య పిల్లల్లో కూతురు తల్లి దగ్గర, 17 ఏళ్ల కుమారుడు తండ్రి దగ్గర ఉంటున్నారు. 

తమ్మునిపై కక్ష పెంచుకుని.. 
రెండవ భార్య కుమారుడు సంతోష్‌ అన్నను కొన్ని రోజు లుగా ‘మా ఇంట్లో నువ్వెందుకు ఉంటున్నావు’అంటూ ప్రశ్నించడమేగాక తరచూ తిడుతుండటంతో సంతోష్‌పై అన్న కక్ష పెంచుకున్నాడు. ఫిబ్రవరి 22న పొలం వద్ద గడ్డి కోసుకువద్దామని చెప్పి తమ్ముడిని తీసుకొని వెళ్లాడు. ఎవరూ లేని సమయంలో సంతోష్‌ గొంతుకు తాడు వేసి ఊపిరాడకుండా చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం పక్కనే ఓ పొలం వద్ద ఉన్న చీరను తెచ్చి అందులో బాలుడి మృతదేహాన్ని చుట్టి తీగతో కట్టి బావిలో పడేశాడు. సంతోష్‌ కోసం కుటుంబసభ్యులు, పోలీసులు అన్ని చోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. గత పది రోజులుగా గ్రామానికి చెందిన పలువురితో పాటు, అన్నను విచారించడంతో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అన్నను జువెనైల్‌ హోంకు తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు