విచారణ సమయంలో నిందితుడి ఆత్మహత్య

23 Oct, 2022 09:34 IST|Sakshi

సాక్షి, చెన్నై: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విభాగం అధికారుల విచారణ సమయంలో ఓ నిందితుడు మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు తెలంగాణ వాసిగా గుర్తించారు. వివరాలు.. తమకు అందిన సమాచారం మేరకు శుక్రవారం చోళవరంలో చెన్నై మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ విభాగం అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో రాయప్పరాజు అనే వ్యక్తిని ఆ విభాగం సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 8 కేజీల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం అతడిని అయపాక్కంలోని ప్రధాన కార్యాలయానికి తరలించి శుక్రవారం రాత్రంతా ప్రశ్నించారు. శనివారం వేకువ జామున రాయప్పరాజు హఠాత్తుగా మూడో అంతస్తులోని విచారణ గది నుంచి బయటకు పరుగులు తీసి అనంతరం కిందకి దూకేశాడు. తీవ్రగాయాలతో పడి ఉన్న రాయప్పరాజును అక్కడి సిబ్బంది ఆవడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలో రాయప్ప రాజు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై తిరుముల్‌లైవాయిల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో మృతుడు తెలంగాణ రాష్ట్రం రామకృష్ణాపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 

కుటుంబం పరువు పోతుందనే వేదనతో 
రాయప్పరాజు ఐటీ సంస్థలో పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పుకుంటూ, చెన్నై నుంచి మాదక ద్రవ్యాలను తెలంగాణకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. తాను మాదక ద్రవ్యాలతో పట్టుబడడంతో కుటుంబం తీవ్ర అవమానం పాలవుతుందనే వేదనతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే ఇతని వద్ద పట్టుబడ్డ మాదక ద్రవ్యాలు విమానాశ్రయంలో సీజ్‌ చేసినవి కావడం గమనార్హం.

అక్కడి అధికారులు, సిబ్బంది ఎవరో సీజ్‌ చేసిన మాదకద్రవ్యాలను ఇతని ద్వారా బయటకు పంపిస్తున్నట్టు తేలింది. దీంతో ఈ కేసును మరింత సమగ్రంగా విచారించేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. మృతుడు 48 కేజీల మేరకు సీజ్‌ చేసిన మాదక ద్రవ్యాలను తెలంగాణకు తరలించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. 

(చదవండి: దొంగతనం కోసం వచ్చి ఆత్మహత్య..)

మరిన్ని వార్తలు