Actor Arya: అంతా మోసం.. ఆ అమ్మాయితో హీరో ఆర్యకు సంబంధమే లేదట

25 Aug, 2021 16:34 IST|Sakshi

తన మనసు గాయమైందని హీరో ఆవేదన

సైబర్‌ పోలీసులకు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్‌

చెన్నె: తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీలంక యువతి పెట్టిన కేసులో ప్రముఖ నటుడు ఆర్యకు భారీ ఊరట లభించింది. అసలు ఆ కేసుతో ఆర్యకు సంబంధం లేదని తేలింది. ఉద్దేశపూర్వకంగానే ఆర్యను ఇరికించారని పోలీసులు గుర్తించారు. అయితే ఆర్యపై ఆరోపణలు చేసిన వారిని పోలీసులు అరెస్ట్‌ చేయడంతో ఇంతటితో ఆవివాదం సద్దుమణిగింది. ఈ పరిణామంపై ఆర్య హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద ఉపశమనం లభించింది అని పేర్కొన్నాడు. ఆ ఆరోపణలు తన మనసును గాయపరిచాయని తెలిపాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీలంకకు చెందిన యువతి విద్జా జర్మనీలో ఉంటోంది. ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆమె జర్మనీలో ఉండే ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతోపాటు ఆర్యతో చేసిన చాటింగ్‌ అంటూ కొన్ని స్క్రీన్‌షాట్‌ ఫొటోలు కూడా విడుదల చేసింది. చెన్నెలో ఆర్యను మూడు గంటల పాటు విచారించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఆగస్టు 17వ తేదీకి విచారణ చేసింది.

ఈ కేసుపై మరిన్ని విషయాలు తెలుసుకోవాలని పోలీసులకు ఆదేశించడంతో ఆర్యను విచారించారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని చెన్నెలో కమిషనర్‌ ఎదుట ఆర్య ఆగస్టు 10వ తేదీన విచారణకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా పలు విషయాలు పోలీసులు ఆరా తీశారు. నేరం ఏమీ చేయకపోవడంతో ఆర్య సానుకూలంగా పోలీసులు అడిగిన వాటికి సమాధానం ఇచ్చాడు.

విచారణలో ఆర్య నేరం చేయలేదని తేలడంతో పోలీసులు మరో కోణంలో విచారణ చేపట్టారు. ఈ సమయంలో పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. చెన్నెలోని పులియంతోపకు చెందిన మహమ్మద్‌ ఆర్మాన్‌, మహ్మద్‌ హుస్సేనీ ఇద్దరూ కలిసి ఆర్య పేరుతో నకిలీ వాట్సప్‌ క్రియేట్‌ చేశారు. ఆ వాట్సప్‌ ద్వారా శ్రీలంక యువతి విద్జాతో చాటింగ్‌ చేసి డబ్బులు దండుకున్నారు. పోలీసులు వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: ఎంతటి దుస్థితి! అఫ్గాన్‌ మంత్రి నేడు డెలివరీ బాయ్‌గా)

ఈ పరిణామంపై ఆర్య హర్షం వ్యక్తం చేశారు. నిజమైన నేరస్తులను పట్టుకున్నందుకు సైబర్‌ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు మనసుని గాయపరిచిందని తెలిపారు. ఇప్పుడు ఎంతో ఉపశమనంగా ఉందని ట్వీట్‌ చేశాడు. తన మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తమిళ సినీ పరిశ్రమలో అగ్ర నటుడిగా ఉన్న ఆర్య తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. వరుడు, రాజారాణి, వాడువీడు, ఇటీవల సారపట్టతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ప్రస్తుతం విశాల్‌తో కలిసి ‘ఎనిమి’ సినిమా చేస్తున్నాడు. అయితే ఆర్యకు సయేషా​సైగల్‌తో వివాహమైంది. వీరిది ప్రేమ వివాహం. ‘అఖిల్' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన సాయేషా ఆర్యతో కలిసి ‘గజినీకాంత్' సినిమా చేసింది. ఆ సమయంలోనే ప్రేమాయణం సాగింది. 2019లో మార్చ్ 10వ తేదీన పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. సయేషా వివాహం తరువాత సినిమాలు చేయలేదు. ఇటీవల సయేషా ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు