పట్టపగలే సినీ ఫక్కీలో ఘరానా మోసం

6 Nov, 2021 15:19 IST|Sakshi

35గ్రాముల బంగారంతో ఉడాయించిన నకిలీ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారి

రూ.లక్షా 87వేలకు టోకరా

ఆర్టీజీఎస్‌ ద్వారా డబ్బులు పంపినట్లు మెస్సేజ్‌ చూపించి బురిడీ

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో సినీ ఫక్కీలో ఘరానా మోసం జరిగింది. ఇదివరకు రాత్రి వేళల్లో దుకాణ తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతుండే వారు. ఇప్పుడు పట్టపగలే సినీ ఫక్కీలో మోసాలకు పాల్పడుతున్నారు. నిరంజన్‌ అనే వ్యక్తి రూ.లక్షా 87వేల విలువ గల బంగారు ఆభరణాలను కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు జ్ఞానేశ్వర్‌ వివరాల ప్రకారం.. ఈనెల 1న మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు షాపుకు వచ్చాడు. తులం (10 గ్రాముల) లక్ష్మి లాకెట్‌ కావాలని అడిగాడు. 5గ్రాముల లాకెట్‌ ఉందని చెప్పడంతో దానిని కొనుగోలు చేస్తానని చెప్పాడు.

అలాగే 3 తులాల చైన్‌ కావాలని అడుగగా యజమాని పలు రకాల చైన్లు చూపించాడు. రెండు ఆభరణాలకు రూ.లక్షా 87వేల 183 బిల్లు అయ్యింది. క్యాష్‌ను లెక్కపెట్టి టేబుల్‌ మీద రూ.లక్ష వరకు ఉంచాడు. జీఎస్టీ బిల్లు ఉందా అని అడిగి ఆ తర్వాత ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేస్తానని అనడంతో యజమాని సరే అన్నాడు. అకౌంట్‌ నంబర్‌ అడుగగా చెక్‌బుక్‌ చూపించడంతో ఆర్టీజీఎస్‌ ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేస్తానని చెప్పి బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అకౌంట్‌ ద్వారా షాపు యజమాని కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ ఖాతాలో జమ చేసినట్టు ఫోన్‌లో మెస్సేజ్‌ చూపించాడు. దీంతో యజమాని నమ్మాడు.

కొంత సమయం తర్వాత షాపు యజమాని బ్యాంక్‌ అధికారులకు ఫోన్‌చేసి తన అకౌంట్‌లో డబ్బు జమపై ఆరా తీశాడు. ఆర్టీజీఎస్‌ ద్వారా డబ్బులు జమ కావడానికి కొంత సమయం పడుతుందని అధికారులు తెలిపారు. మరికొంతసేపు తర్వాత షాపు పక్కన ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌కు వెళ్లి అక్కడ మెస్సేజ్‌ను అధికారులకు చూపించగా నగదు కొంత సమయం తర్వాత వస్తుందని చెప్పారు. ఆ తర్వాత అనుమానం వచ్చి మరోసారి వెళ్లి ఆ బ్యాంక్‌కు చూపించగా ఇది పేక్‌ అకౌంట్‌ని నిర్ధారించారు. దీంతో షాప్‌ యజమాని కంగుతిన్నాడు.

ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అధికారిగా..
షాపుకు వచ్చిన వ్యక్తి నిరంజన్‌గా పరిచయం చేసుకుని ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అధికారిగా చెప్పుకొచ్చాడు. ఢిల్లీ నుంచి ఆదిలాబాద్‌కు బదిలీపై వచ్చినట్లు హిందీలో మాట్లాడాడు.  మధ్యాహ్నం మరో 50గ్రాముల బంగారం కావాల్సి ఉందని తెలిపాడు. మీ వద్ద బంగారం నాణ్యతకు సంబంధించిన హోల్‌మార్క్‌ ఉందా అని అడిగి, షాపులో బంగారం ధరలకు సంబంధించిన వివరాలు ప్రదర్శించాలని, లేకుంటే నీపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నాడు.

దీంతో ఆ షాపు యజమాని నిజంగానే ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అధికారి అని నమ్మాడు. కారులో వచ్చిన నిందితుడు డ్రైవర్‌ను కారులో ఉంచి షాపులోనికి వచ్చాడు. షాపు యజమాని తాను మోసపోయానని తెలియడంతో వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో రికార్డింగ్‌ను సైతం పోలీసులకు చూపించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలాగే ఆదిలాబాద్‌ ఇన్‌కమ్‌ట్యాక్స్‌ కార్యాలయంలోనూ ఆరా తీయగా నకిలీగా తేలింది. ప్రస్తుతం అతడి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌లో ఉంది.

మరిన్ని వార్తలు