పిల్లల దత్తత పేరుతో మోసం

27 Jun, 2021 07:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, జగిత్యాల(కరీంనగర్‌): సంతానం లేని వారికి పిల్లలను దత్తత ఇప్పిస్తానంటూ ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.8.34 లక్షలు వసూలు చేసిన ఓ వ్యక్తి తర్వాత పరారయ్యాడు. దీంతో బాధితులు జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. మంచిర్యాల జిల్లా నర్సాపూర్‌ కాలనీకి చెందిన నల్ల రాజేశ్‌  జగిత్యాల మిషన్‌ కాంపౌండ్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. స్థానిక ద్వారకానగర్‌కు చెందిన సీహెచ్‌.వెంకటేశ్వర్లు, శ్వేత దంపతులకు సంతానం కలగకపోవడంతో పిల్లలను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రాజేశ్‌ వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి, తాను ప్రభుత్వ శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగినని చెప్పాడు. ఇప్పటివరకు నాందేడ్, గోవా, మహారాష్ట్ర నుంచి పిల్లలను తీసుకువచ్చి చాలా మందికి దత్తత ఇప్పించానని నమ్మించాడు. ఆయన వద్ద రెండు రూ.2.46 లక్షలు తీసుకున్నాడు. గొల్లపల్లి మండలం రాఘవపట్నంకు చెందిన వెంగళదాస్‌ గంగాధర్‌–మాధవి దంపతులనూ సంప్రదించి, రూ.2.36 లక్షలు తీసుకున్నాడు.

మల్యాల మండలం సర్వాపూర్‌కు చెందిన మల్యాల కనకయ్య–పున్నమ్మ దంపతులు రాజేశ్‌ను కలిసి రూ.3.46 లక్షలు ఇచ్చారు. వీరందరికి 2, 3 రోజుల్లో పిల్లలను దత్తత ఇప్పిస్తానని నమ్మించాడు. తర్వాత ఫోన్‌ చేస్తే రేపు మాపు అంటూ దాటవేశాడు. డబ్బులు తీసుకొని నెలలు గడుస్తున్నా పిల్లలను దత్తత ఇప్పించకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. దీంతో జగిత్యాలలోని మాతా, శిశు సంక్షేమ శాఖ, ఐసీడీఎస్, బాలల సంరక్షణ కేంద్రానికి వెళ్లి రాజేశ్‌ గురించి ఆరా తీయగా అతను ప్రభుత్వ ఉద్యోగి కాదని తేలింది. శుక్రవారం సాయంత్రం జగిత్యాల పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు టౌన్‌ సీఐ జయేశ్‌రెడ్డి శనివారం తెలిపారు. కాగా పిల్లల దత్తత పేరుతో రాజేశ్‌ జిల్లావ్యాప్తంగా వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

చదవండి:  బావ కోసం దళంలో చేరి...

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు