చిన్నారికి వాతలు పెట్టిన అంగన్‌వాడీ టీచర్‌

6 Jan, 2022 10:16 IST|Sakshi
చిన్నారి అభిజ్ఞ

సాక్షి, యాదగిరిగుట్ట(నల్లగొండ): చిన్నారులను ప్రేమతో బుజ్జగించాల్సిన అంగన్‌వాడీ టీచర్‌ దారుణానికి ఒడిగట్టారు. అభం శుభం తెలియని చిన్నారికి వాతలు పెట్టి గాయపరిచారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందుకూరు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుర్రం సుదర్శన్, అనూషల కుమార్తె అభిజ్ఞ (5) గ్రామంలోని అంగన్‌వాడీ సెంటర్‌–1కి వెళ్తోంది.

రోజు మాదిరిగానే బుధవారం కూడా వెళ్లింది. ఆ చిన్నారి కేంద్రంలో ఏడ్చినందుకు సెంటర్‌ ఉపాధ్యాయురాలు సునీత చిన్నారి అభిజ్ఞ చెంప, రెండు చేతులు, పెదవులపై వాతలు పెట్టారు. దీంతో ఏడ్చుకుంటూ వచ్చిన చిన్నారి విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. వెంటనే కుటుంబ సభ్యులు టీచర్‌ తీరుపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పిల్లలపై ఇంత కిరాతకంగా వ్యవహరించిన అంగన్‌వాడీ టీచర్‌ సునీతపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, తానేమీ వాతలు పెట్టలేదని అంగన్‌వాడీ టీచర్‌ సునీత చెప్పారు. వారికి, తమకు మధ్య ఉన్న కుటుంబ గొడవలతో తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు