అక్కపై కోపంతో.. అయిదు నెలల కొడుకుని హత్య చేసి బావిలో వేసిన తల్లి 

14 Nov, 2022 19:29 IST|Sakshi
బావి వద్ద గాలిస్తున్న పోలీసులు   

సాక్షి, మహబూబ్‌నగర్‌: దివ్యాంగురాలైన చెల్లిని చేరదీసి.. తన భర్తకు రెండో వివాహం చేసి జీవితమిచ్చిన అక్కపై కోపంతో కన్నబిడ్డను హత్య చేసింది ఓ కసాయి తల్లి. పైగా నిద్రలో ఉండగా తన బిడ్డను ఎవరో ఎత్తుకెళ్లారంటూ అర్ధరాత్రి హంగామా సృష్టించి తప్పించుకునేందుకు చేసిన హైడ్రామా కథ బెడిసికొట్టి అడ్డంగా దొరికిపోయింది. ఈ సంఘటన నారాయణపేట జిల్లా కోస్గిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కోస్గిలోని ఎస్సీకాలనీకి చెందిన మద్దూరు గోవింద్‌కు కర్ణాటక రాష్ట్రంలోని కానగడ్డకు చెందిన మొగులమ్మతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది.

వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. అయితే మొగులమ్మ చెల్లెలు కాశమ్మ పుట్టుకతో మూగ, చెవుడు కావడంతో తన చెల్లెలి జీవితాన్ని ఎలాగైనా నిలబెట్టాలని తన భర్త గోవిందును ఒప్పించి రెండేళ్ల క్రితం రెండో వివాహం జరిపించింది. కుటుంబ విషయమై అక్క చెల్లిని మందలిస్తూ ఉండేది. ఈ క్రమంలో రెండు రోజులుగా అక్కాచెల్లెళ్ల మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి.

దీంతో అక్కపై కోపం పెంచుకున్న కాశమ్మ శనివారం ఇంట్లో అందరూ భోజనాలు చేసి నిద్రించిన తర్వాత అర్ధరాత్రి బాబును తీసుకెళ్లి హత్య చేసి పట్టణ శివారులోని శంభుని గుడి సమీపంలో ఉన్న నీళ్లబావిలో పడేసింది. ఇంటికి వచ్చిన కాశమ్మ తన బాబును ఎవరో ఎత్తుకెళ్లారని కుటుంబ సభ్యు లకు రోదిస్తూ సైగలు చేసింది. అయితే కొన్ని రోజులుగా దొంగలు తిరుగుతున్నారనే పుకార్లు ఉండటంతో కాలనీ మొత్తం మేల్కొంది. యువకులు కాలనీలో గాలించి ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
చదవండి: ప్రియుడితో కలిసి భర్తను చంపి.. అదే ఇంట్లో గోతి తీసి.. నాలుగేళ్ల తర్వాత

తప్పించుకునే ప్రయత్నంలో.. 
పోలీసులు ఆదివారం ఉదయం కాలనీకి చేరుకొని వివరాలు సేకరించారు. ఇంట్లో అక్కాచెల్లెళ్ల మధ్య గొడవ జరగడంతో బాబును కుటుంబ సభ్యులే ఏదో చేశారని ప్రాథమికంగా నిర్ధారించారు. మొదట మొగులమ్మపై అనుమానం వచ్చినప్పటికీ పోలీసులు బాధిత కుటుంబ సభ్యులందరినీ స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో విచారించడంతో అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది. దివ్యాంగురాలైన కాశమ్మ అక్కపై కోపంతో క్షణికావేశంలో బిడ్డను తానే చంపి బావిలో వేసినట్లు ఒప్పుకుంది. బాబును వేసిన బావిని చూపడంతో పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. 

మరిన్ని వార్తలు