మరో ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థి ఆత్మహత్య.. వారంలో రెండో ఘటన

7 Sep, 2022 12:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐఐటీ హైదరాబాద్‌లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌కు చెందిన మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజస్థాన్‌ రాష్ట్రంలోని జోథ్‌పూర్‌కు చెందిన మేఘా కపూర్‌ ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. మూడు నెలల క్రితమే బీటెక్‌ పూర్తి చేసిన మేఘా కపూర్‌ అప్పటినుంచి సంగారెడ్డిలోని ఓ లాడ్జీలో రూమ్‌ అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లిలోని ఓ హోటల్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కాగా వారం వ్యవధిలో ఇది రెండో ఘటన. ఆగస్టు 31న ఐఐటీ హైదరాబాద్‌లో ఎంటెక్‌ చదువుతున్న రాహుల్‌​ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన గదిలోని మంచం రాడ్‌కు నైలాన్‌ తాడుతో ఉరివేసుకుని బలవన్మరణం పొందారు. ‘ఇంపార్టెంట్‌ టెక్ట్స్‌.. ప్లీజ్‌ సీ ల్యాప్‌టాప్‌.’ అని రాహుల్‌ సూసైడ్‌ నోట్‌ కూడా రాశాడు. సంగారెడ్డిలోని ఐఐటీలో 2019 నుంచి ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులు సుసైడ్‌ చేసుకున్నారు. క్యాంపస్‌లో వరుస ఆత్మహత్యలపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 
చదవండి: ఫీజులను పెంచేసిన పలు కాలేజీలు

మరిన్ని వార్తలు