మద్యం మత్తులో ఏఎస్పీ హల్‌చల్‌ 

6 Apr, 2021 08:07 IST|Sakshi

 హోటల్‌లో పలువురిపై చేయి చేసుకున్న వైనం

కేసు నమోదు చేసిన పోలీసులు  

కోవూరు(నెల్లూరు జిల్లా): మద్యం మత్తులో పలువురిని దూషించడంతో పాటు చేయి చేసుకున్న ఏఎస్పీ శ్రీధర్, అతని స్నేహితులపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. నెల్లూరు జిల్లా కోవూరు శాంతినగర్‌కు చెందిన పంతంగి దేవేంద్ర తన స్నేహితుడు సూర్యవర్ధన్‌తో కలిసి ఆదివారం రాత్రి కోవూరు హైవే పై ఉన్న ఓ హోటల్‌కు టీ తాగేందుకు వెళ్లారు. అదే సమయంలో ఏఎస్పీ(వీఆర్‌) శ్రీధర్, అతని స్నేహితులు మద్యం సేవించి కారులో హోటల్‌ వద్దకు వచ్చారు. మాస్కులెందుకు వేసుకోలేదంటూ దేవేంద్ర, సూర్యవర్ధన్‌లను తీవ్ర పదజాలంతో దూషించడంతో పాటు చేయి చేసుకున్నారు.

కారులో ఉన్న శ్రీధర్‌ స్నేహితులిద్దరూ హోటల్‌ వద్దనున్న మహిళలను అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో బాధితులు కోవూరు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కె.రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ సీహెచ్‌ కృష్ణారెడ్డి ఘటనా స్థలికి చేరుకుని ఏఎస్పీని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ్నుంచి నెల్లూరు రూరల్‌ డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. బాధితులు ఫిర్యాదు మేరకు ఏఎస్పీ శ్రీధర్, అతని స్నేహితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కోవూరు ఎస్‌ఐ తెలిపారు.
చదవండి:
స్నేహితురాలిని రహస్యంగా తీసుకెళ్లి.. చివరకు ఇలా.. 
ఆరోగ్యశ్రీ.. నా బిడ్డకు మళ్లీ మాటలిచ్చింది 

మరిన్ని వార్తలు