వలంటీర్‌పై దాడి చేసి పింఛన్‌ సొమ్ము దోపిడీ

31 Jan, 2021 04:59 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వలంటీర్‌ బీరవల్లి వెంకటరెడ్డి

వెల్ఫేర్‌ అసిస్టెంట్‌పైనా దాడి చేసి పరారీ

విచారణ చేపట్టిన సత్తెనపల్లి డీఎస్పీ  

పిడుగురాళ్ల(గురజాల): గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసేందుకు బ్యాంక్‌లో డబ్బు డ్రా చేసుకుని వెళుతున్న వలంటీర్, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌పై ఇద్దరు అగంతకులు దాడిచేసి నగదు దోచుకెళ్లిన  ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలో శనివారం జరిగింది. జూలకల్లు వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ గడిపూడి శివపార్వతి తెలిపిన వివరాల ప్రకారం.. జూలకల్లు గ్రామ వలంటీర్‌ బీరవల్లి వెంకటరెడ్డి, శివపార్వతి ఇద్దరూ కలిసి ఫిబ్రవరి ఒకటో తేదీన గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసేందుకు  పిడుగురాళ్ల పట్టణంలోని ఆంధ్రా బ్యాంక్‌ (యూనియన్‌ బ్యాంక్‌)లో శనివారం ప్రభుత్వ ఖాతా నుంచి రూ.19, 21, 282 డ్రా చేశారు. అనంతరం ద్విచక్ర వాహనంపై గ్రామానికి వెళ్తుండగా, పందిటివారిపాలెం గ్రామ సమీపంలోని వాగు బ్రిడ్జి వద్ద వెనుక నుంచి పల్సర్‌ బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు క్రికెట్‌ బ్యాట్‌తో బైక్‌ నడుపుతున్న వలంటీర్‌ తలపై బలంగా కొట్టారు. దీంతో బైక్‌తో పాటు ఇద్దరూ రోడ్డు పక్కన పొలాల్లో పడిపోయారు.

వలంటీర్‌ స్పృహ కోల్పోవడంతో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ శివపార్వతిని కూడా క్రికెట్‌ బ్యాట్‌తో తలపై కొట్టేందుకు ప్రయత్నించగా, చేయి అడ్డు పెట్టడంతో చేతికి గాయమైంది. దీంతో ఆ ఇద్దరు ఆగంతకులు వీరి దగ్గర ఉన్న నగదు బ్యాగ్‌ను లాక్కుని తిరిగి పిడుగురాళ్ల వైపు పారిపోయారు. పల్సర్‌ బైక్‌ నడిపే వ్యక్తి హెల్మెట్‌ పెట్టుకుని ఉండగా, క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టిన వ్యక్తి తలపై క్యాప్‌ ధరించి ఉన్నాడు.  జూలకల్లు గ్రామానికి చెందిన వ్యక్తులు  గాయాలపాలైన వీరిని చూసి ఆస్పత్రికి తరలించారు. కాగా, దాడి విషయమై శివపార్వతి పిడుగురాళ్ల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వలంటీర్‌ వెంకటరెడ్డి తలకు బలమైన దెబ్బ తగలడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం తెలుసుకున్న సత్తెనపల్లి డీఎస్పీ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని వివరాలు సేకరించారు.

మూడు బృందాలతో విచారణ
పింఛను సొమ్ము చోరీ కేసులో దుండగులను పట్టుకునేందుకు పోలీసు శాఖ  మూడు బృందాలను ఏర్పాటు చేసింది. నగదు డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్లినప్పటి నుంచి తిరిగి వచ్చేవరకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను అధికారులు పరిశీలిస్తున్నారు.   

మరిన్ని వార్తలు