రైనా బంధువులపై దాడి కేసు: ముఠా అరెస్ట్‌

16 Sep, 2020 15:59 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రముఖ క్రికెటర్‌ సురేష్‌ రైనా మేనత్త కుటుంబంపై దాడి కేసు మిస్టరీ వీడింది. పంజాబ్‌కు చెందిన అంతరాష్ట్ర ముఠా ఈ ఘోరానికి పాల్పడినట్లు సిట్‌ అధికారులు తేల్చారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురిని బుధవారం అరెస్ట్‌ చేశారు. ఆగస్టు 19వ తేదీన పఠాన్‌కోట్‌, తర్యల్‌లోని రైనా మేనత్త కుటుంబంపై ఈ ముఠా దాడికి పాల్పడింది. ఈ దాడిలో అశోక్‌ కుమార్‌(రైనా మామ) సంఘటనా స్థలంలోనే మృతి చెందగా.. ఆయన కుమారుడు కౌశల్‌ కుమార్‌ ఆగస్టు 31న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. రైనా మేనత్త ఆశా రాణి పరిస్థితి ప్రస్తుతం సీరియస్‌గా ఉంది. దాడిలో గాయపడ్డ మరి కొందరు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి స్పెషల్‌ ఇన్‌వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌)కు ఆదేశించిన సంగతి తెలిసిందే. దర్యాప్తు ప్రారంభించిన సిట్‌ దాదాపు 100మంది అనుమానితుల్ని విచారించింది. ( సురేష్‌ రైనా కుటుంబంలో తీవ్ర విషాదం )

ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 15న అధికారులకు ఓ ముఖ్య సమాచారం అందింది. దాడి జరిగిన నాటి మరుసటి రోజు ఉదయం ఓ ముగ్గురు వ్యక్తుల్ని అక్కడి ఓ రోడ్డులో చూశామని, ఆ ముగ్గురు పఠాన్‌ కోట్‌లోని రైల్వే స్టేషన్‌ దగ్గర ఉంటున్నారని వారికి తెలియవచ్చింది. దీంతో వెంటనే ఆ అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. విచారణలో వారే ఈ నేరం చేసినట్లు రుజువైంది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ( మా అంకుల్‌ను చంపేశారు: రైనా )

మరిన్ని వార్తలు