నలుగురిదీ ఒక్కటే మాట..

29 Sep, 2020 03:00 IST|Sakshi

హ్యాష్‌ డ్రగ్‌ కాదు

దీపికా, రకుల్, శ్రద్ధా, సారాలను ఎన్‌సీబీ మళ్లీ పిలిచే అవకాశం

కరణ్‌ జోహార్‌ పేరును ఇరికించిన రియా లాయర్‌

బాలీవుడ్‌–డ్రగ్స్‌ లింకులపై మరింత లోతుగా దర్యాప్తు

ముంబై: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో డ్రగ్స్‌ కోణంలో జరుపుతున్న విచారణలో నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) చేతికి కీలక విషయాలు లభ్యమైనట్లు సమాచారం. ఈ కేసు విచారణ సందర్భంగా హీరోయిన్లు దీపికా పదుకొణె, శ్రద్ధాకపూర్, రకుల్‌ ప్రీత్‌ సింగ్, సారా అలీఖాన్‌లు ఎన్‌సీబీకి చెప్పిన విషయాలు దాదాపు ఒకేలా ఉన్నాయని తెలుస్తోంది. ‘హ్యాష్‌’ మత్తు పదార్థం కాదనే విషయాన్నే వీరు నలుగురూ చెప్పినట్లు సమాచారం.

అయితే, ఇదే విషయం వీరిని మరిన్ని చిక్కుల్లోకి నెట్టే అవకాశాలున్నాయని కూడా భావిస్తున్నారు. దీంతోపాటు, వీరు కీలక సమాచారాన్ని ఎన్‌సీబీ అధికారుల ఎదుట బయటపెట్టినట్లుగా సమాచారం. దీని ఆధారంగా ఈ హీరోయిన్లను మరోసారి ప్రశ్నించేందుకు ఎన్‌సీబీ సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలంటున్నాయి.

ఇప్పటి వరకు జరిపిన విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలపై ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ కేపీఎస్‌ మల్హోత్రా, సమీర్‌ వాంఖడే, అశోక్‌ జైన్‌ రూపొందించిన సమగ్ర నివేదికపై ఆదివారం రాత్రి ఎన్‌సీబీ డైరెక్టర్‌ జనరల్‌ ఆస్తానా నేతృత్వంలో సమావేశం జరిగింది. ముంబైలో విస్తరించిన డ్రగ్‌ మాఫియా మూలాలను వెలికితీసి, చార్జిషీటు వేసేందుకు దాదాపు ఆరు నెలల సమయం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు కూడా ఆస్తానా పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది.  20 మంది బడా డ్రగ్‌ సరఫరాదారులపై ఎన్‌సీబీ కన్నువేసినట్లు సమాచారం.

కోర్టులో కరణ్‌ పేరు
సుశాంత్‌ సింగ్‌ మృతి, బాలీవుడ్‌– డ్రగ్స్‌ సంబంధాల కేసుల్లో దర్శకుడు కరణ్‌ జోహార్‌ పేరును ప్రస్తావించారు రియా చక్రవర్తి– క్షితిజ్‌ రవి ప్రసాద్‌ తరఫు లాయర్‌ సతీశ్‌ మనేషిండే.
ఈ కేసులో కరణ్‌ పేరును ప్రస్తావిస్తూ వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా క్షితిజ్‌ను అధికారులు బెదిరింపులు, వేధింపులకు గురి చేశారని కోర్టుకు తెలిపారు. ముంబైలోని కోర్టు క్షితిజ్‌కు ఆదివారం రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన వాదనల్లో మనేషిండే..విచారణ సమయంలో అధికారులు క్షితిజ్‌పై థర్డ్‌డిగ్రీ ప్రయోగించారనీ, కరణ్‌ జోహార్‌ పేరు కూడా వాంగ్మూలంలో చెప్పాలంటూ ఒత్తిడి చేశారని అన్నారు.

ఆ పేరు చెబితే వదిలిపెడతామంటూ ఆశ చూపారన్నారు. క్షితిజ్‌ ఇంట్లో సోదాల సమయంలో సిగరెట్‌ పీక మాత్రమే అధికారులకు దొరికినా అది గంజాయి అంటూ ఆరోపించారని తెలిపారు. 2019లో కరణ్‌ జోహార్‌ ఇంట్లో జరిగిన పార్టీలో పాల్గొన్న పలువురు బాలీవుడ్‌ నటులు డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. దీనిపై ముంబైకి వస్తున్న కరణ్‌ను గోవా ఎయిర్‌పోర్టులో మీడియా ప్రశ్నించగా ఆయన మాట్లాడలేదు. తనకు డ్రగ్స్‌ అలవాలు లేదనీ ఆయన గతంలోనే వ్యాఖ్యానించడం తెల్సిందే.

మరిన్ని వార్తలు