విషాదం: కుటుంబాన్ని వీడలేక.. డ్యూటీ చేయలేక.. 

18 Sep, 2022 19:30 IST|Sakshi
రామారావు(ఫైల్‌)

బూర్జ(శ్రీకాకుళం జిల్లా): మండలంలోని అన్నంపేటలో శనివారం  బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నంపేటకు చెందిన సాకేటి రామారావు (48) త్రిపురలో బీఎస్‌ఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. విశాఖపట్నంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. రెండు రోజుల కిందట స్వగ్రామం అన్నంపేటలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చారు.
చదవండి: వింత మనుషులు.. చీకటి గదిలో నుంచి వెలుగులోకి..

కాళ్లనొప్పి కారణంగా డ్యూటీ చేయలేకపోతున్నానని, కుటుంబ బాధ్యతలు కూడా సక్రమంగా నెరవేర్చలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా ఇదే విషయమై భార్య, తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం తండ్రి పొలం పనులకు వెళ్లిన సమయంలో పురుగు మందు తాగాడు. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు 108 అంబులెన్సులో రాగోలు జెమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. రామారావుకు భార్య భాగ్యవతి, ఇంటర్మీడియెట్‌ చదువుతున్న కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి తండ్రి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు