ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో దర్యాప్తు ముమ్మరం

21 Aug, 2022 05:53 IST|Sakshi

నిందితులకు సీబీఐ సమన్లు 

ముగ్గురిని ప్రశ్నించిన అధికారులు 

త్వరలో మరికొందరికి సమన్లు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎక్సైజ్‌ పాలసీ అమలుకు సంబంధించిన అవినీతి వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. శనివారం ముగ్గురు నిందితులను తమ ప్రధాన కార్యాలయానికి రప్పించి, ప్రశ్నించింది. వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. పూర్తి వివరాలను అధికారులు బహిర్గతం చేయడం లేదు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా సహా మొత్తం 15 మంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన సంగతి తెలిసిందే. సీబీఐ శనివారం కొందరు నిందితులకు సమన్లు జారీ చేసింది.

శుక్రవారం మనీశ్‌ సిసోడియా నివాసం సహా వివిధ ప్రాంతాల్లో సోదాల్లో స్వాధీనం చేసుకున్న కీలక డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీల పత్రాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నన్లు అధికారులు చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మరికొందరు నిందితులకు సమన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. వారందరినీ పిలిపించి, లిక్కర్‌ కుంభకోణంపై లోతుగా విచారిస్తామని అన్నారు. ఈ కుంభకోణంలో మనీ లాండరింగ్‌ కూడా జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సైతం దృష్టి పెట్టింది. ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోని సమాచారాన్ని సీబీఐ.. ఈడీకి అందజేసింది.

మరిన్ని వార్తలు