న్యాయవాద దంపతుల హత్య ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలి

27 Feb, 2021 04:32 IST|Sakshi

హైకోర్టును ఆశ్రయించిన వామన్‌రావు తండ్రి

సాక్షి, హైదరాబాద్‌: న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, పీవీ నాగమణిల దారుణహత్య ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ‘‘అధికార పార్టీ నేతలపై, పోలీసులపై, స్థానిక రాజకీయ నాయకుల అక్రమాలపై వామన్‌రావు, నాగమణి అనేక కేసులు వేశారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ అక్రమాలపై కూడా హైకోర్టులో కేసులు వేశారు. దీంతో తన కుమారుడు, కోడలిపై పుట్ట మధుకర్, ఆయన అనుచరులు వ్యక్తిగత ద్వేషం పెంచుకున్నారు. పుట్ట మధుకర్‌కు నేరచరిత్ర ఉంది. గతంలో ఆయనపై రౌడీషీట్‌ ఉండటంతోపాటు అనేక క్రిమినల్‌ కేసులు విచారణలో ఉన్నాయి. ఓ వివాదంలో పుట్ట మధుకర్‌పై వామన్‌రావు గోదావరిఖని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అలాగే మంథని మున్సిపల్‌ చైర్మన్, మధుకర్‌ భార్య శైలజ ఎన్నికను సవాల్‌ చేస్తూ పీవీ నాగమణి ఎన్నికల పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. శీలం రంగయ్య అనే వ్యక్తి పోలీసు కస్టడీలో మృతి చెందిన ఘటనపై లాకప్‌డెత్‌గా పేర్కొంటూ నాగమణి రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించి దర్యాప్తునకు ఆదేశించింది. మైనింగ్, ఇసుక మాఫియాకు చెందిన వారే రంగయ్యను హత్య చేయించారని వామన్‌రావు నాకు చెప్పాడు. నా కుమారుడి హత్య వెనుక పెద్ద వ్యక్తులు ఉన్నారు. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ తన కుమారుడిపై గతంలో అవాస్తవాలను ప్రచారం చేశారు. ఆయన ఆధ్వర్యంలో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందన్న నమ్మకం లేదు. నిందితులు అధికార పార్టీకి చెందిన నేతలు. నిందితులతో స్థానిక పోలీసులకు సంబంధాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కమిషనర్‌ సహా స్థానిక పోలీసు అధికారులను వెంటనే అక్కడి నుంచి బదిలీ చేయాలి. హత్య ఘటనపై పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈనెల 17న నమోదైన క్రైమ్‌ నంబర్‌ 21/2021 దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి’’అని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ ఒకటి, రెండ్రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా, న్యాయవాద దంపతుల హత్యకు నిరసనగా బార్‌ అసోసియేషన్స్‌ ఫెడరేషన్‌ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం నాంపల్లి క్రిమినల్‌ కోర్టు న్యాయవాదులు సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు