అంబులెన్స్‌ దొంగ అరెస్టు 

21 Sep, 2022 03:08 IST|Sakshi
పోలీసులు స్వాధీనం చేసుకున్న అంబులెన్స్‌  

రాంగోపాల్‌పేట్‌: కరీంనగర్‌ నుంచి రోగిని తీసుకుని వచ్చిన ఓ అంబులెన్స్‌ను దొంగిలించిన వ్యక్తిని చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అంబులెన్స్‌ను స్వాధీనం చేసికున్నారు. మంగళవారం ఉత్తర మండలం డీసీపీ కార్యాలయంలో అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ సుధీర్, చిలకలగూడ ఇన్‌స్పెక్టర్‌ నరేష్, డీఐ నాగేశ్వరరావులతో కలిసి డీసీపీ చందనాదీప్తి వివరాలు వెల్లడించారు.

కరీంనగర్‌ వావిలపల్లికి చెందిన లింగంపల్లి శ్రీనివాస్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.  పెద్దపల్లి జిల్లా, పాలకుర్తి మండలం, కన్నాల గ్రామానికి చెందిన రాజేందర్‌ పురుగుల మందు తాగి కరీంనగర్‌  ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడిని తీసుకుని ఈ నెల 19న శ్రీనివాస్‌ గాంధీ ఆస్పత్రి అత్యవసర విభాగానికి వచ్చాడు. అంబులెన్స్‌ తాళం చెవులు అలాగే ఉంచి రోగిని తీసుకుని ఆస్పత్రి లోపలికి వెళ్లాడు.

అతను బయటికి వచ్చి చూడగా అంబులెన్స్‌ కనిపించ లేదు. దీంతో చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడిని బోయిగూడ ఐడీహెచ్‌కాలనీకి చెందిన కాకి యాదగిరి అలియాస్‌ యాదిగా గుర్తించారు. మంగళవారం అతడి ఇంటి వద్దకు వెళ్లగా అంబులెన్స్‌ కూడా అక్కడే ఉంది. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు