బాలికతో కానిస్టేబుల్‌ వివాహం: పోక్సో చట్టం కింద అరెస్టు 

13 Jun, 2021 07:44 IST|Sakshi

సాక్షి, చెన్నై: బాల్య వివాహాలను అడ్డుకోవాల్సిన పోలీసే మైనర్‌ బాలికను పెళ్లి చేసుకుని కటకటాలపాలయ్యాడు. వివరాలు.. మదురై జిల్లా తిరుమంగళం సమీపంలోని మైకుడి గ్రామానికి చెందిన పళని కుమార్‌ (27) మాధవరం పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత నెల సెలవుపై స్వగ్రామానికి వెళ్లాడు. మరోవైపు పళని కుమార్‌ మేన మామ కుమార్తె (17) ఓ యువకుడిని ప్రేమిస్తోంది. అతడితో పారిపోతుందనే భయంతో కుటుంబ సభ్యులు పళనికుమార్‌తో ఈ నెల 17వ తేదీ పెళ్లి చేశారు. భార్యతో కలిసి చెన్నైలోని క్వార్టర్స్‌లో పళని కాపురం పెట్టాడు.

ఈ క్రమంలో బాలికను ప్రేమించిన ప్రియుడు బాల్య వివాహల నియంత్రణ విభాగానికి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు  చేశాడు. దీంతో ఉన్నతాధికారుల విచారించగా, కుటుంబ గౌరవం కోసం తాను ఈ  పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నా ఫలితం లేకుండా పోయింది. ప్రియుడి కోసం  ఆ బాలిక సైతం అడ్డం తిరగడంతో పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. పళని కుమార్‌ని కోర్టులో హాజరుపరిచి కటకటాల్లోకి నెట్టారు.  

బాబాకి మళ్లీ సమన్లు 
పెరుమాల్‌ అవతారంగా చెప్పుకునే శివశంకర్‌ బాబాకు చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిషన్‌ మళ్లీ సమన్లు జారీ చేసింది. తన పరిధిలోని ఇంటర్నేషనల్‌ స్కూల్లో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు  పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఉత్తరాఖండ్‌ ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లిన బాబాకు గుండెపోటు వచ్చిందని.. ఆయన డెహ్రాడూన్‌లోని ఆస్పత్రిలో ఉన్నట్టు చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిషన్‌కు శనివారం సమాచారం అందింది. దీంతో మరో రోజు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి. 
చదవండి: ఉపాధ్యాయుల ఫొటోలను అశ్లీల చిత్రాలుగా మార్చి.. ఆపై

మరిన్ని వార్తలు