ఒంటరైన మూడేళ్ల చిన్నారి

4 Jan, 2021 09:33 IST|Sakshi
కోమల్, ఖాదరీఫ్, కరీం (పాత చిత్రం)

అన్నవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతి

 తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన మూడేళ్ల చిన్నారి

భార్య, భర్త, మూడేళ్ల బాబు.. అందమైన కుటుంబం.. జీవితం ఎంతో సరదాగా సాగిపోతోంది. భర్త ఓ కంపెనీలో అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్, భార్య గృహిణి. మూడు రోజుల క్రితం కుటుంబం అందరూ కలసి నూతన సంవత్సరం వేడుకల కోసం తుని నుంచి రాజమహేంద్రవరం వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. ఆదివారం మధ్యాహ్నం డ్యూటీ ఉండడంతో తిరిగి తుని బయల్దేరి వస్తుండగా.. విధి ఆ కుటుంబంపై పగబట్టింది. రోడ్డు ప్రమాద రూపంలో వారి జీవితాలను చిదిమేసింది. భార్యభర్తలను మృత్యు ఒడికి చేర్చి.. ఆ మూడేళ్ల చిన్నారిని తల్లి, తండ్రి లేని ఒంటరిని చేసింది. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆ బాలుడికి ఏం జరిగిందో, అమ్మా, నాన్న ఏమయ్యారో తెలియక బిత్తరచూపులు చూస్తున్నాడు.

సాక్షి, అన్నవరం: జాతీయ రహదారిపై ఆదివారం అన్నవరం వద్ద మధ్యాహ్నం డివైడర్‌ను బైక్‌ ఢీ కొట్టిన ప్రమాదంలో  దానిపై  ప్రయాణిస్తున్న భర్త మహ్మద్‌ కరీం(32) అక్కడికక్కడే మృతి చెందగా, భార్య మహ్మద్‌ అరీష్‌ కోమల్‌(26) తుని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. బండి మీద వారిద్దరి మధ్య కూర్చున్న మూడేళ్ల బాలుడు కరీముల్లా ఖాదరీఫ్‌ తీవ్రంగా గాయపడ్డాడు.  పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరానికి చెందిన మహ్మద్‌ కరీం పదేళ్లుగా విశాఖ జిల్లా రాజవరంలోని డక్కన్‌ కెమికల్స్‌లో అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు 2014లో కాకినాడకు చెందిన మహ్మద్‌ అరిష్‌ కోమల్‌తో వివాహమైంది. వీరు ఆరేళ్లుగా తునిలో నివాసం ఉంటున్నారు. మూడు రోజుల క్రితం నూతన సంవత్సర వేడుకల కోసం రాజమహేంద్రవరం వెళ్లిన వీరు ఆదివారం హీరోహోండా గ్లామర్‌ బైక్‌(ఏపీ05, డీబీ 6213)పై తిరిగి తుని బయల్దేరారు. వారి కుమారుడు ఖాదరీఫ్‌ను మధ్యలో కూర్చోబెట్టుకున్నారు.

అన్నవరం జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా.. స్నేహ రెసిడెన్సీ సమీపంలో డివైడర్‌ను వీరి బైక్‌ ఢీకొని ఒక్కసారిగా కింద పడిపోయారు. మహ్మద్‌ కరీం, భార్య అరిష్‌ కోమల్‌ రోడ్డు పక్కనే పడిపోగా, కుమారుడు ఖాదరీఫ్‌ పక్కనే ఉన్న తుప్పల్లో పడ్డాడు. స్థానికులు వీరిని గమనించి వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేయగా..  108 సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని పరీక్షించగా మహ్మద్‌ కరీం అప్పటికే చనిపోయాడు. భార్య, తీవ్ర గాయాలతో తుప్పల్లో పడి ఉన్న కుమారుడు ఖాదరీఫ్‌ను గమనించి వెంటనే తుని ఆసుపత్రికి తరలిస్తుండగా భార్య అరిష్‌ కోమల్‌ మార్గం మధ్యలో చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. బాలుడు ఖాదరీఫ్‌కు తీవ్ర గాయాలవ్వడంతో అతడిని తుని ప్రభుత్వాసుపత్రి వైద్యుల సిఫారసుతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అన్నవరం ఎస్సై అజయ్‌ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: అడ్వాన్స్ ఇవ్వలేదని ప్రయాణికురాలి పీక కోశాడు..)

మరిన్ని వార్తలు