రోడ్డు ప్రమాదంలో బావబామ్మర్దుల దుర్మరణం

14 Nov, 2023 13:09 IST|Sakshi
మహేష్‌, యోహాన్‌(ఫైల్‌)

కమలాపురం : కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బావబామ్మర్దులు దుర్మరణం చెందారు. దీంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు, బంధువుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం రాజులపాడు గ్రామానికి చెందిన బింగి యోహాన్‌(31), తన బావమరిది నాగలూరు మహేష్‌(29) ఇద్దరూ కలసి తాపీ మేసీ్త్రలుగా పని చేస్తూ జీవనం సాగించే వారు. వారు కమలాపురం మండలంలోని నల్లింగాయపల్లెలో నివాసం ఉంటూ.. సమీప గ్రామాల్లో బేల్దారి పనులు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పనులు పూర్తి కావడం ఆలస్యం కావడంతో ఇంటికి వచ్చారు. ఆ సమయంలో తినడానికి ఏమీ లేక పోవడంతో పందిళ్లపల్లె వద్ద ఉన్న శ్రీకాంత్‌ హోటల్‌కు వెళ్లి భోజనం చేశారు. బైక్‌కు పెట్రోల్‌ పట్టించుకోవడానికి బంక్‌కు వెళుతూ రోడ్డు దాటుతుండగా.. ఎర్రగుంట్ల వైపు నుంచి కడప వైపు వెళ్లే లారీ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో వారు బైక్‌తో సహా రోడ్డు పక్కనున్న పొదల్లో పడ్డారు. అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ హృషికేశ్వర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.

ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. కాగా యోహాన్‌కు భార్య విశ్వేశ్వరమ్మ, చిన్న వయస్సు గల కుమారుడు, కుమార్తె ఉన్నారు. అలాగే మహేష్‌కు భార్య బుజ్జమ్మ, ముగ్గురు చిన్న వయస్సు గల కుమారులు ఉన్నారు. బుజ్జమ్మ ప్రస్తుతం గర్భవతి.

మరిన్ని వార్తలు