రూ.5 కాయిన్‌కు రూ.5 లక్షలట! 

9 Mar, 2021 08:40 IST|Sakshi

నగరవాసి నుంచి రూ.39 వేలు స్వాహా

చీర అమ్మబోయిన వ్యక్తికీ భారీ టోకరా

మోసాలకు పాల్పడిన సైబర్‌ నేరగాళ్లు

సాక్షి, సిటీబ్యూరో: వెనుక వైపు దేవతా మూర్తుల బొమ్మలతో కూడిన కరెన్సీ నాణేలను భారీ మొత్తం వెచ్చించి ఖరీదు చేస్తానంటూ ఎర వేసిన సైబర్‌ నేరగాడు నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.39 వేలు వసూలు చేశాడు. నగదు చెల్లించిన తర్వాత అది మోసమని గుర్తించిన బాధితుడు సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాను ఆశ్రయించాడు. పోలీసుల కథనం ప్రకారం.. పాత కరెన్సీ నాణేలు, నోట్లు ఖరీదు చేస్తామని నగరానికి చెందిన వ్యక్తికి ఇటీవల ఓ బల్క్‌ సందేశం వచ్చింది. నాణెం వెనుక వైపు దేవతా మూర్తుల బొమ్మలతో కూడిన రూ.5 నాణేన్ని రూ.5 లక్షలకు, రూ.10 నాణేన్ని రూ.10 లక్షలకు ఖరీదు చేస్తానంటూ నమ్మబలికాడు. దీంతో తన వద్ద రూ.5 నాణేలు 4 ఉన్నాయంటూ నగరవాసి చెప్పడంతో నగదు బదిలీ చేయడానికి ముందుగా పన్నులు చెల్లించాలని సైబర్‌ నేరగాడు సూచించాడు. దీనికి నగరవాసి అంగీకరించడంతో జీఎస్టీ సహా వివిధ పేర్లు చెప్పి రూ.39 వేలు తన ఖాతాలోకి బదిలీ చేయించుకున్నాడు. తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

మరో ఘటనలో.. 
నగరానికి చెందిన మరో వ్యక్తి తన వద్ద ఉన్న పట్టు చీరలు విక్రయించేందుకు ఈ– యాడ్స్‌ యాప్‌ ఓఎల్‌ఎక్స్‌లో దాని ఫొటోతో ప్రకటన ఇచ్చారు. సదరు చీరను రూ.8300 విక్రయిస్తానంటూ అందులో పేర్కొన్నారు. ఆ చీరను తాను ఖరీదు చేస్తానని సైబర్‌ నేరగాడు చెప్పాడు. నగదు మొత్తాన్ని గూగుల్‌ పే రూపంలో పంపిస్తానని నమ్మబలికాడు. ఇలా ఓ క్యూఆర్‌ కోడ్‌ను పంపి స్కాన్‌ చేయాలంటూ చెప్పాడు. నగరవాసి అలాగే చేయడంతో ఇతడి ఖాతాలోకి నగదు రావడానికి బదులు.. ఖాతా నుంచి డబ్బు కట్‌ అయి సైబర్‌ నేరగాడికి చేరిపోయింది. ఇలా మొత్తం రూ.84 వేలు కాజేశాడు. బాధితుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

చదవండి:

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

నాన్నా బాగానే ఉన్నా అంటూ చివరి ఫోన్‌కాల్‌..

మరిన్ని వార్తలు