‘ఆ తుపాకీని రాజస్తాన్‌లో కొన్నారు’

13 Jan, 2021 14:31 IST|Sakshi

రూ.55 లక్షల విలువైన మెటిరీయల్‌, రూ. 9లక్షలు స్వాధీనం

పని కావాలంటూ వెళ్లి.. రెక్కి నిర్వహించి రాత్రి 11-03గంటలప్పుడు చోరి చేసేవారు

నిందితులంతా ఉత్తరప్రదేశ్‌, రాజస్తాన్‌కు చెందిన వారు

11 మంది అరెస్ట్‌.. పీడీ యాక్ట్‌ పెట్టాం

సాక్షి, హైదరాబాద్‌: శంకర్ పల్లి, ఆర్‌సీపురంలో దొంగల ముఠా ఒకటి ఆయుధాలు వాడి కన్‌స్ట్రక్షన్ సైట్లలో సెక్యూరిటీలను బెదిరించి దొంగతనాలకు పాల్పడ్డ సంగతి తేలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు బుధవారం వారిని అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. ‘ఆర్‌సీ పురం, శంకర్‌పల్లి ఘటనలతో అంతరాష్ట్ర దొంగలు రాష్ట్రంలోకి వచ్చారని భావించి టీమ్స్ ఏర్పాటు చేశాము. ఖచ్చితమైన సమాచారం మేరకు దొంగలను అరెస్ట్ చేశాం. వారితో పాటు దొంగతనం చేసిన వారి దగ్గర నుంచి మెటీరియల్ కొనేవారిని కూడా అరెస్ట్ చేశాం. వీరిలో మనీష్ అనే ఓ ఎలక్ట్రికల్ షాప్ ఓనర్‌తో పాటు, స్క్రాప్‌ ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తి ఒకరు ఉన్నారు. వారి దగ్గర నుంచి సుమారు 55 లక్షల రూపాయలు విలువ చేసే మెటీరియల్ స్వాధీనం చేసుకున్నాం. 9,50,000 రూపాయల నగదు సీజ్‌ చేశాం. ఇందులో ప్రధాన నందితులైన యూపీ రాజస్తాన్‌కు చెందిన 11 మందిని అరెస్ట్ చేశాం’ అని తెలిపారు సజ్జనార్‌. (చదవండి: నకిలీ ఐపీఎస్‌ అధికారి అరెస్టు)

ఇక ‘నిందితులంతా ఎలక్ట్రిషన్స్.. వీరందరూ ఢిల్లీలో పని చేసినపుడు కలుసుకున్నారు. కొన్ని రోజులు హైదరాబాద్‌లో నిర్మాణ సంస్థలో పని చేశారు. కొల్లూరులో దొంగతనం చేశాక ఆ మెటీరియల్‌ను మనీష్ ఎలక్ట్రికల్ షాపులో అమ్మేశారు. వచ్చిన డబ్బులను జల్సాలకు వాడేవారు. దొంగతనం చేయడానికి వర్క్ కావాలనే సాకుతో సైట్‌లోకి వెళ్లి రెక్కి నిర్వహించేవారు. ఒకరు వర్క్ గురించి మాట్లాడుతుంటే మరి కొందరు అక్కడ పరిసరాలను గమనించేవారు. ఈ ముఠా రాత్రి 11 నుంచి 3 గంటల మధ్య దొంగతనాలకు పాల్పడేవారు. ఎంసీబీ ప్యానెల్ బోర్డ్‌లను చోరి చేసేవారు.. వాటిని మనీష్ ఎలక్ట్రికల్ షాపులో అమ్మేవారు’ అని సజ్జనార్‌ తెలిపారు. (చదవండి: మోస్ట్‌ వాంటెడ్ ఫహీమ్ దొరికాడు)

ఇక మూడు రోజుల క్రితం మాకు ఓ స్పెసిఫిక్ కేసు వచ్చింది...ఇంతకు ముందు ఆర్‌సీపురం, శంకర్ పల్లి, ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో గట్టి నిఘా ఏర్పాటు చేశాం.. ఎట్టకేలకు అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశాము. ఇందులో రాజస్తాన్‌కు చెందిన ప్రదీప్ కుష్వాల్ ప్రధాన నిందితుడిగా గుర్తించాము. ఇన్ఫ్రా కంపెనీలు సెక్యూరిటీ పెంచుకోవాలి. అంతర్గతంగా విజిలెన్స్ ఏర్పాటు చేసుకోవాలి. అలారాలను ఏర్పాటు చేసుకోవాలి..అరెస్ట్ అయిన వారందరిపై పీడి యాక్ట్ పెడతాం. దొంగతనాలు చేసేటప్పుడు బెదిరించటానికి వాడిన తుపాకిని రాజస్తాన్‌లో కొన్నారు’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు