పొలం అమ్మడం కోసం ...ఏకంగా కలెక్టర్, జేసీ సంతకాలనే ఫోర్జరీ....

23 May, 2022 08:55 IST|Sakshi

అనంతపురం శ్రీకంఠంసర్కిల్‌: ఏకంగా జిల్లా కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌ సంతకాలనే ఫోర్జరీ చేశారు. వాటి ఆధారంగా నకిలీ నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) సృష్టించారు. దానిపై ఓ ప్రజాప్రతినిధికి అనుమానం రావడం, ఆయన కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో అసలు బాగోతం వెలుగు చూసింది. అధికార వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూడేరు మండలం కమ్మూరు గ్రామ సర్వే నంబర్‌ 525, 526లో బోయ నారాయణప్ప పేరిట 34.86 ఎకరాల పొలముంది.

దీనికి 1954వ సంవత్సరంలోనే డి.పట్టా మంజూరైంది. ఈ భూమిని ఇటీవల అనంతపురం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొని.. అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. అతను వేరే వ్యక్తికి అమ్మాలనుకుని.. ఎన్‌ఓసీ కోసం దరఖాస్తు చేశాడు. దానిపై తహసీల్దార్, ఆర్డీఓ సంతకాలు పూర్తయ్యాయి. జేసీ, కలెక్టర్‌ సంతకాలు చేయాల్సి ఉంది. కానీ అంతలోనే సదరు వ్యక్తి ఓ రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్‌ ఆపరేటర్‌ను ఆశ్రయించి పని త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరాడు. దీంతో కంప్యూటర్‌ ఆపరేటర్‌ కలెక్టర్, జేసీ సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఎన్‌ఓసీ సృష్టించి అతనికి అందజేశాడు. 

ప్రజాప్రతినిధికి అనుమానం రావడంతో.. 
సదరు ఎన్‌ఓసీ ఓ ప్రజాప్రతినిధి చేతికి వెళ్లింది.  అంత త్వరగా ఎన్‌ఓసీ రావడంపై ఆయనకు అనుమానం వచ్చింది. ఇదే విషయాన్ని కలెక్టర్‌  నాగలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్‌ పరిశీలించి  నకిలీదిగా నిర్ధారించారు. దీని సృష్టికర్తలెవరో తేల్చాలంటూ అనంతపురం ఆర్డీఓ మధుసూదన్‌ను ఆదేశించారు. దీంతో ఆయన విచారణ చేపడుతున్నారు. కలెక్టర్, జేసీ సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఎన్‌ఓసీ సృష్టించారని ఆర్డీఓ కూడా నిర్ధారించారు. 

కంప్యూటర్‌ ఆపరేటర్‌ పనేనా? 
అనంతపురంలో పనిచేస్తున్న పుట్టపర్తి ప్రాంతానికి చెందిన కంప్యూటర్‌ ఆపరేటర్‌ నకిలీ ఎన్‌ఓసీని తయారు చేసినట్లు తెలుస్తోంది. అతనితో పాటు మరొక వ్యక్తి పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. వారిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. సదరు కంప్యూటర్‌ ఆపరేటర్‌ టీడీపీ హయాంలోనూ ఇలాంటి పని చేసి అప్పటి జేసీ చేతికి చిక్కినట్లు సమాచారం. అప్పట్లో జిల్లా ఉన్నతాధికారులకు రాజకీయ ఒత్తిళ్లు రావడంతో విషయం బయటకు రాలేదు.   

(చదవండి: సవతి తల్లి కర్కశం...మేడపై నుంచి తోసి..గొంతు నులిమి)

మరిన్ని వార్తలు