డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు: రూ.కోటికి పైగా వసూలు

19 Sep, 2020 13:29 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు మంజూరు చేయిస్తామని నకిలీ కేటాయింపు లేఖలతో నమ్మించి రూ.లక్ష లు వసూలు చేస్తున్న ముఠాను దుండిగల్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.72,80,000 నగదు,తాడేపల్లి గూడెంలోని ప్లాటు డాక్యుమెంట్, నకిలీ డబుల్‌ బెడ్‌రూమ్‌ కేటాయింపు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సీపీ సజ్జనార్‌ వివరాలు వెల్లడించారు.  

సెక్రటేరియట్‌లో పరిచయాలున్నాయని... 

  • వెంకట సత్యకృష్ణ వరప్రసాద్‌ అనే వ్యక్తి దుండిగల్‌ ఠాణా పరిధిలోని బహూదూర్‌పల్లిలోని ఓ వైన్స్‌ షాప్‌ వద్ద మద్యం కొనుగోలు చేస్తుండగా ఓ ఇద్దరు వ్యక్తులు డబుల్‌ బెడ్‌రూమ్‌ కేటాయింపు నకిలీ లేఖలపై చర్చిస్తుండటాన్ని గుర్తించాడు. దీంతో అతను వారితో మాట్లాడి సదరు లేఖ ను తన సెల్‌ఫోన్‌లో ఫొటో తీసుకున్నాడు. అనంతరం నకిలీ లేఖలు తయారు చేయడంలో సిద్ధహస్తుడైన బౌరంపేటకు చెందిన వెంకట్‌ను సంప్రదించి అదే తరహాలో లేఖలను తయారు చేయించాడు. అనంతరం అదే ప్రాంతంలో ఉంటున్న తన బంధువు మురళీ కృష్ణ మూర్తిని కలి సి తనకు సెక్రటేరియట్‌లో మంచి పరిచయాలున్నాయని డబుల్‌ బెడ్‌రూమ్‌లు మంజూరు చేయిస్తానని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన మురళీకృష్ణ తన స్నేహితుడు ఇపూరి వెంకటేశ్వర రాజును పరిచయం చేశాడు. అనంతరం వెంకటేశ్వరరాజు, తన బంధువు కలెపల్లి పద్మదుర్గకు ఈ విషయాన్ని చెప్పాడు. ఇలా  తమకున్న పరిచయాల ద్వారా ఒక్కో డబుల్‌ బెడ్‌రూమ్‌కు రూ.1,20,000  నుంచి రూ1,70,000 వరకు వసూలు చేశారు. 

వసూళ్లలోనూ కమీషన్‌.. 

  • పద్మ 38 మంది నుంచి రూ.47,60,000 వసూలు చేసింది. అందులో తన కమీషన్‌ రూ.5,80,000 మినహాయించుకొని రూ.44 లక్షలు వెంకటేశ్వరరాజుకు ఇచ్చింది.  ఇదే తరహాలో వెంకటేశ్వరరాజు రూ.53,57,000 వసూలు చేశాడు. ఇందులో తన కమీషన్‌ రూ.6,98,700 మినహాయించుకొని మిగిలిన సొమ్మును వెంకట కృష్ణమూర్తి వరప్రసాద్‌కు అందజేశాడు. ఇలా 89 మంది పెద్ద మొత్తంలో వసూలు చేశాడు. రోజులు గడుస్తున్నా ఇళ్లు మంజూరు కాకపోవడంతో కొంపల్లికి చెందిన తులసమ్మ ఫిబ్రవరి 5న ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన దుండిగల్‌ పోలీసులు  దర్యాప్తు చేపట్టి శుక్రవారం నిందితులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా దుండిగల్‌ ఇన్‌స్పెక్టర్‌  వెంకటేశంతో పాటు ఇతర సిబ్బందిని సీపీ రివార్డులతో సత్కరించారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు