భారీ మోసం: రూపాయికే సరుకులు! ఎగబడిన కస్టమర్లు

22 Jun, 2021 23:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ షాపింగ్‌ పేరిట కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. బంపర్‌ ఆఫర్‌ అని ప్రకటించి సరుకులు ఆర్డర్‌ పెట్టి డబ్బులు చెల్లించిన అనంతరం డెలివరీ చేయకపోవడంతో వినియోగదారులు భారీగా నష్టపోయారు. సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకుని హైదరాబాద్‌ ప్రజలు మోసపోయారు. సైబర్ నేరగాళ్లు ఈ కొత్త పంథాను ఎంచుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. తక్కువ ధరలకు నిత్యావసరాల సరుకులు అందిస్తామంటూ ‘జాప్ నౌ’ అనే వెబ్‌సైట్ ప్రకటన ఇచ్చింది.

కొన్ని వస్తువులు కేవలం ఒక్క రూపాయికే అందిస్తామని వల వేశారు. క్యాష్ అండ్‌ డెలివరీ కాకుండా ఆన్‌లైన్ చెల్లింపు మాత్రమే చేయాలని నిబంధన విధించారు. ఆఫర్‌ బాగా ఉందని భావించిన వినియోగదారులు పెద్ద ఎత్తున ఈ వెబ్‌సైట్‌లో ఆర్డర్లు ఇచ్చారు. తీరా డబ్బు చెల్లించి కొన్ని రోజులైనా వస్తువులు డెలివరీ కాలేదు. తాము మోసపోయామని గుర్తించిన బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి కేసులు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 5 ఫిర్యాదులు నమోదయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు