టీఎస్‌పీఎస్సీ చైర్మన్, కార్యదర్శిపై ఈడీ ప్రశ్నలవర్షం 

2 May, 2023 04:30 IST|Sakshi

పేపర్‌ లీకేజీపై ఏకధాటిగా 11 గంటలపాటు విచారణ 

లీకేజీ ముందు, తర్వాత తీసుకున్న చర్యలపై వాంగ్మూలాల నమోదు  

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో సుమారు రూ. 40 లక్షలు చేతులు మారినట్లు తేలడం, ఇందులో మనీలాండరింగ్‌ కోణం ఉండటంతో రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)... తాజాగా పరీక్షల నిర్వహణ తీరుతెన్నులు, లీకేజీ పరిణామాలపై కమిషన్‌ చైర్మన్‌ బి. జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌లను సోమవారం సుదీర్ఘంగా విచారించింది. వారిని ఏకదాటిగా 11 గంటలపాటు విచారించి వాంగ్మూలాలు నమోదు చేసింది. 

అన్ని కోణాల్లో ప్రశ్నలు..: ఈడీ అధికారుల నోటీసుల మేరకు జనార్ధన్‌రెడ్డి, అనితా రామచంద్రన్‌లు సోమవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని వేర్వేరుగా అన్ని కోణాల్లో విచారించారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షల నిర్వహణ ఎలా ఉంటుంది..? ప్రశ్నపత్రాల తయారీ, వాటి భద్రత, చైర్మన్, కార్యదర్శిల పర్యవేక్షణ, కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లో ఉద్యోగుల విధులు, ఆ విభాగంలోకి ఇతర ఉద్యోగులు వెళ్లేందుకు ఉన్న అవకాశాలు వంటి అంశాలపై వివరాలు సేకరించారు.

అలాగే పేపర్ల లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తీరు, తీసుకున్న చర్యలు తదితర అంశాలపైనా ప్రశ్నించారు. అనంతరం ఈ కేసులోని కీలక నిందితులైన ప్రవీణ్‌ కుమార్, రాజశేఖర్‌రెడ్డిల పాత్రపై ఆరా తీసినట్లు తెలిసింది. ఉద్యోగంలో వారి చేరికతోపాటు విధులు, బాధ్యతలు, ప్రవర్తన ముఖ్యంగా టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వివిధ సమస్యల పరిష్కారానికి వచ్చే మహిళా అభ్యర్థులతో ప్రవీణ్‌ స్నేహాల గురించి అనితా రామ్‌చంద్రన్‌ను ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం.

లీకేజీకి పాల్పడిన ఉద్యోగులపై శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు...? ఈ మొత్తం వ్యవహారంలో ఇంకెవరైనా ఉద్యోగులకు సంబంధం ఉన్నట్టు మీ అంతర్గత దర్యాప్తులో ఏమైనా తెలిసిందా? అని జనార్దన్‌రెడ్డిని అడిగినట్లు తెలిసింది. తెలంగాణ స్టేట్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌ ఉద్యోగులను సైతం ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలియవచ్చింది. ఈ కేసులో నిందితురాలైన గురుకుల టీచర్‌ రేణుకకు సంబంధించిన వివరాలపై ముగ్గురు గురుకుల టీచర్ల నుంచి కూడా ఈడీ అధికారులు సోమవారం వాంగ్మూలాలు తీసుకున్నట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు