తీవ్ర విషాదం: గుక్కెడు నీళ్లు దొరక్క దాహార్తితో..

9 Jun, 2021 16:16 IST|Sakshi
మనవరాలి మృతదేహం వద్ద అమ్మమ్మ సుఖిదేవి

జైపూర్‌: గ్రామానికి అమ్మమ్మతో నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారి దాహంతో అలమటించి అలమటించి చివరకు మృత్యు ఒడికి చేరింది. ఈ విషాద ఘటన రాజస్థాన్‌ రాష్ట్రంలో జరిగింది. గుక్కెడు నీళ్లు దొరక్క చిన్నారి కన్నుమూయడం తీవ్ర విషాదం నింపింది. అయితే ఆ అవ్వ కూడా దాహంతో అల్లాడి స్పృహ తప్పి పడిపోయింది. అటుగా వెళ్లేవారు గుర్తించి సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి అవ్వకు నీళ్లు తాగించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

రాయ్‌పూర్‌లోని రాణివాడ తాలుక రోడ గ్రామానికి చెందిన సుఖిదేవి భిల్‌ (60), ఐదేళ్ల మనమరాలు ఆదివారం గ్రామానికి నడుచుకుంటూ బయల్దేరారు. రాయిపూర్‌ నుంచి నడుచుకుంటూ 15 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి వెళ్తున్నారు. ఆ సమయంలో ఎండ తీవ్రంగా ఉంది. నడిచి నడిచి అలసిపోయారు. దాహం వేస్తున్నా ఎక్కడా నీళ్లు లభించలేదు. దీంతో వారిద్దరూ మార్గమధ్యలో కుప్పకూలిపోయారు. దాహార్తితో పాప నీరసించిపోయి మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అవ్వకు నీళ్లు తాపించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌లో ఎండలు అధికంగా ఉంటాయి. పాప నీళ్లు లేక మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది.

చదవండి: లాక్‌డౌన్‌తో ఛాన్స్‌ల్లేక నటుడు ఆత్మహత్యాయత్నం


నీళ్లు తాగిస్తున్న పోలీసులు

మరిన్ని వార్తలు