ఇదేందయ్యా ఇదీ.. ఈ ట్విస్ట్‌ మామూలుగా లేదుగా!.. సినిమా స్టైల్లో..

14 Nov, 2022 18:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అక్కిరెడ్డిపాలెం(విశాఖపట్నం): టైం ఎంత అయిందో మర్చిపోయారు. ఆటలో మునిగిపోయారు. ఉదయం వెళ్లిన చిన్నారులు సాయంత్రం వరకు ఇంటికి రాలేదు.  డైరెక్ట్‌గా ఇంటికి వెళితే తల్లిదండ్రులు కొడతారని భయపడ్డారు. పోలీసుల ద్వారా ఇంటికి చేరితే ఏమీ అనరని ప్లాన్‌ చేసుకున్నారు. అంతే డయల్‌ యువర్‌ 100కు ఫోన్‌ చేసి తామంతా కిడ్నాప్‌ అయ్యామని చెప్పారు.

దీనికి సబంధించి గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 69వ వార్డు రెడ్డితుంగ్లాంకు చెందిన 11 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులు ఆదివారం ఆడుకోవడానికి చుక్కవానిపాలెం వద్ద గల ఒక చెరువు వద్దకు వెళ్లారు. సాయంత్ర సమయం దాటి చీకటి పడుతుందడటంతో తల్లిదండ్రులు కొడతారని భావించారు. దీంతో వీరి వద్ద నున్న ఫోన్‌తో డయల్‌ 100కు ఫోన్‌ చేసి తాము కిడ్నాప్‌ అయ్యామని తెలిపారు.

ఎక్కడున్నారని పోలీసులు అడగగా.. చుక్కవానిపాలెం సువర్ణ శ్రీనివాసం అపార్ట్‌మెంట్స్‌ పక్కనున్న ఎంవీపీ బిల్డర్స్‌ అపార్ట్‌మెంట్స్‌ వెనుక ఉన్నామని తెలిపారు. దీంతో గాజువాక ఎస్‌ఐ సతీష్‌ సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులను కనుగొని వారిని క్షేమంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కిడ్నాప్‌ కాదని, పిల్లలు భయపడి ఇలా చేశారని పోలీసులు వెల్లడించారు.
చదవండి: ఢిల్లీ: ప్రియురాలి హత్యోదంతం.. సంచలన విషయాలు వెలుగులోకి  

మరిన్ని వార్తలు