మోసగాళ్లు: వందలు.. వేలు.. లక్షలు చేతిలో పడగానే జంప్‌

20 Jun, 2021 16:14 IST|Sakshi

విజయనగరం క్రైమ్‌: చదువుకుంటామంటూ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. పిన్నీ.. అక్కా.. చెల్లీ.. అంటూ బంధుత్వాలు కలిపారు. వారి నుంచి చిన్న మొత్తాల్లో డబ్బులు తీసుకునేవారు. తిరిగి వడ్డీతో ఇచ్చేవారు. ఆర్థికంగా నమ్మకం కలిగించారు. రూ.లక్షలు చేతికి చిక్కాక.. గుట్టుచప్పుడు గాకుండా ఉడాయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టూటౌన్‌ పోలీసులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. చదువుకుంటామంటూ కొన్ని నెలల కిందట నలుగురు యువకులు కొత్తపేట గొల్లవీధిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఇరుగుపొరుగువారితో మాటామంతీ కలిపారు.

అక్కా, చెల్లి, పిన్ని అంటూ వరుసులతో పిలిచేవారు. నమ్మకంగా వ్యవహరిస్తూ చిన్నపాటి మొత్తం తీసుకోవడం, రెండు రోజుల తర్వాత వడ్డీతో కలిపి ఇవ్వడం అలవాటు చేశారు. ఇలా వేల రూపాయల్లో తీసుకున్న మొత్తం కాస్తా రూ.లక్షల్లోకి వెళ్లింది. అదనంగా డబ్బులిస్తున్నారనే అత్యాశకు పోయినవారు సుమారు రూ.ఆరేడు లక్షల వరకూ అప్పులిచ్చినట్టు సమాచారం. రూ.లక్షలు చేతిలో పడగానే నలుగురు యువకులు మకాం ఎత్తేయడంతో బాధిత మహిళలు లబోదిబోమంటున్నారు. టూటౌన్‌ పోలీసులను ఆశ్రయించి గోడు వెల్లబోశారు. ఈ విషయంపై టూటౌన్‌ సీఐ సీహెచ్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ మహిళలు సమస్య చెప్పుకునేందుకు వచ్చారే తప్ప ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు. ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి నిందితులను పట్టుకుంటామన్నారు. 

చదవండి: గుట్టురట్టు: కవర్‌ను లాగితే నకిలీ తేలింది..   
నువ్వు మగాడివైతే చిటికేసి చూడు

మరిన్ని వార్తలు