ప్రేమ పేరుతో యువతికి రూ.7లక్షల టోకరా.. నిందితుడు అరెస్టు

4 Sep, 2022 09:20 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ప్రేమ, పెళ్లి పేరుతో ఓ మహిళను మోసం చేసిన వ్యక్తిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పట్టుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ జే నరేందర్‌ గౌడ్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్‌లోని వెయిట్‌ లాస్‌ క్లినిక్‌లో బాధితురాలు పనిచేస్తుంది. తిరుపతి తిమ్మినాయుడుపాలెంకు చెందిన వేలం శివతేజ 2016లో తన శరీర బరువును తగ్గించుకునేందుకు ఈ క్లినిక్‌కు వెళ్లాడు. ఆ సమయంలో బాధితురాలి ఫోన్‌ నంబరుతీసుకున్నాడు. తరచు ఆమెతో చాటింగ్‌ చేస్తూ స్నేహం పెంచుకున్నాడు. తాను కెనడాలో ఉద్యోగం చేస్తున్నానని, తిరుపతిలో భారీగా ఆస్తులున్నాయని నమ్మబలికాడు. ఆ తర్వాత తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.

కొన్ని నెలలు గడిచాక.. ఆమెకు తెలియకుండా మరో మహిళలను వివాహమాడాడు. ఈ క్రమంలో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన శివతేజ.. బాధితురాలి నుంచి డబ్బు గుంజాలని పథకం వేశాడు. గతేడాది ఏప్రిల్‌లో ఆమెను సంప్రదించి.. తన బ్యాంకు ఖాతాలు స్తంభించిపోయాయని, వీసా ప్రాసెసింగ్, భవన నిర్మాణం, మెడికల్‌ ఎమర్జెన్సీ పేరుతో బాధితురాలిని డబ్బు అడిగాడు. అతడి మాటలు నమ్మిన బాధితురాలు గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య కాలంలో పలు దఫాలుగా రూ.7,13,053 నిందితుడి బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసింది.

ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోమని బాధితురాలు బలవంతం చేయడంతో స్పందించడం మానేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితుడు శివతేజను తిరుపతిలో అరెస్టు చేసి, హైదరాబాద్‌కు తీసుకొచి్చ, జ్యూడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి సెల్‌ఫోన్, రెండు సిమ్‌కార్డులను స్వా«దీనం చేసుకున్నారు.
చదవండి: మామ బాగా రిచ్..స్నేహితులను ఉసిగొల్పి దోపిడీ చేయించిన అల్లుడు

మరిన్ని వార్తలు