రూ.3 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం

12 Jul, 2021 04:43 IST|Sakshi
బంగారు ఆభరణాలను సీజ్‌ చేసి నిందితుల అరెస్ట్‌ చూపుతున్న పోలీసులు

వాహన తనిఖీల్లో గుర్తించిన ఎస్‌ఈబీ 

హైదరాబాద్‌ నుంచి బెంగళూరు తరలిస్తున్న నిందితులు

కర్నూలు: స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో తనిఖీల్లో భారీగా బంగారం, నగదు పట్టుబడింది. కర్నూలు మండలం పంచలింగాల రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిపై సెబ్‌ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న కారును తనిఖీ చేయగా అందులో రూ.10 లక్షలు, 7 కిలోల బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. వీటి విలువ దాదాపు రూ.3 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

కారులో ఉన్న బెంగళూరుకు చెందిన అజయ్‌గాడియా, డి.ప్రకాశ్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా.. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని కృష్ణా జ్యువెలర్స్‌ నుంచి బెంగళూరు శ్రీధర్మరాయస్వామి ఆలయ రోడ్డులోని షోవాన్‌ జ్యువెలర్స్‌కు తరలిస్తున్నట్టు తెలిపారు. అయితే అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ చూపకపోవడంతో వాహనంతో పాటు నగలు, నగదును సీజ్‌ చేశారు. అరెస్ట్‌ చేసిన ఇద్దరినీ కర్నూలు అర్బన్‌ తాలుకా పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించినట్టు పోలీసులు చెప్పారు. 

మరిన్ని వార్తలు