చిన్న గొడవతో స్నేహితుల చేతిలోనే రౌడీషీటర్‌ మృతి

3 Aug, 2021 08:04 IST|Sakshi

హతుడు మూడు హత్య కేసుల్లో నిందితుడు

రాళ్లతో కొట్టి, బండరాయి వేసి చంపిన స్నేహితులు

అనంతపురం క్రైం: నగరంలో ఆదివారం రాత్రి ఓ రౌడీషీటర్‌ హత్యకు గురయ్యాడు. తాగిన మైకంలో స్నేహితులే అతన్ని మట్టుబెట్టారు. అనంతపురం వన్‌టౌన్‌ సీఐ ప్రతాప్‌రెడ్డి తెలిపిన మేరకు.... నగరంలోని రాజమ్మ కాలనీకి చెందిన గుజిరీ వ్యాపారి ఖాదర్‌బాషా, ఖైరూన్‌బీ దంపతుల కుమారుడు షేక్‌ సికిందర్‌ బాషా అలియాస్‌ సీకే (31) టైల్స్‌ పనిచేసేవాడు. మద్యానికి బానిసైన సికిందర్‌ బాషా వైఖరి నచ్చక ఐదేళ్ల క్రితం అతని నుంచి భార్య విడిపోయింది. ఈ క్రమంలోనే సికిందర్‌ బాషా మరింత జులాయిగా మారాడు. తాగుడు కోసం ఇతరులను బెదిరించి డబ్బు వసూలు చేసుకునేవాడు. ఇందులో భాగంగానే డబ్బు ఇవ్వలేదన్న కసితో 2011లో అనంతపురంలోని గుత్తి రోడ్డులో జిలాన్‌బాషాని, 2020లో కనకదాసు విగ్రహం ఐదు లైట్ల కూడలిలోని ప్రభుత్వ పాఠశాల ఎదుట ఖాదర్‌బాషాని, ఈ ఏడాది రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారంలో బెంగళూరులో మరో వ్యక్తిని హతమార్చాడు. ఈ కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సికిందర్‌ 20 రోజుల క్రితం విడుదలై అనంతపురానికి వచ్చాడు.

అనాలోచితం.. అనివార్యం..
సికిందర్‌కు అనంతపురంలోని కృష్ణదేవరాయనగర్‌కు చెందిన షెక్షావలి అలియాస్‌ బ్రూస్‌లీ, లింగమయ్య కొట్టాలకు చెందిన కుక్కల జిలాన్, అన్సర్, భవానీ నగర్‌ నివాసి అడపాల చంద్రశేఖర్‌ ప్రాణస్నేహితులు. వీరంతా మద్యం, ఇతర వ్యసనాలకు బానిసలు. వీరిలో బ్రూస్‌లీపై రౌడీషీట్, అడపాల చంద్రశేఖర్‌పై సస్పెక్ట్‌ షీట్‌ ఉన్నాయి. ఈ నెల 1న రాత్రి వీరంతా కలిసి గుత్తి రోడ్డులోని ఓ బార్‌లో మద్యం సేవించారు. అనంతరం రెండు బైక్‌లపై ఇళ్లకు బయలుదేరారు.

మార్గమధ్యలో వాణి రైస్‌ మిల్లు వద్దకు చేరుకోగానే కుక్కల్‌ జిలాన్‌ను సికిందర్‌ తిట్టాడు. దీంతో అన్సర్‌ జోక్యం చేసుకుని ఎందుకు తిడుతున్నావంటూ ప్రశ్నించడంతో ఖాళీ బీరు బాటిల్‌తో అన్సర్‌ తలపై సికిందర్‌ కొట్టాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన స్నేహితులు అనాలోచితంగానే సికిందర్‌పై తిరుగుబాటు చేశారు. ఈ ఘటన మనసులో పెట్టుకుని తమపై ఎప్పటికైనా దాడి చేస్తాడని భావించారు. దీంతో రాయి, ఇటుక పెళ్లలతో సికిందర్‌పై దాడి చేశారు. ఓ పెద్ద బండరాయిని బ్రూస్‌లీ ఎత్తి సికిందర్‌పై వేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, 2021లో ఉమాశంకర్‌ అనే వ్యక్తిని ఇదే తరహాలో బండరాయి వేసి హత్య చేసిన కేసులో బ్రూస్‌లీ నిందితుడు. సమాచారం అందుకున్న వన్‌టౌన్‌ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు