స్మార్ట్‌ యోజన వేల్ఫేర్‌ సొసైటీ ఘరానా మోసం.. పత్తా లేకుండా పోయిన సుధాకర్‌

14 Aug, 2022 04:23 IST|Sakshi

 

 

‘కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలో ఫీల్డ్‌ ఆపీసర్‌.. రైల్వేలో జూనియర్‌ అసిస్టెంట్‌.. ఎయిర్‌పోర్ట్‌  అథారిటీలో అడ్మినిస్ట్రేటివ్‌ జాబ్‌.. నేషనల్‌ హైవేస్‌ అథారిటీలో సూపర్‌వైజర్‌ జాబ్‌.. ఏది కోరుకుంటే అది.. మీరు అలా లక్షలు ఇస్తే.. మేము ఇలా జాబ్‌ ఇస్తాం.. ఇదిగో జాయినింగ్‌ లెటర్‌..’ స్మార్ట్‌గా ఎరవేసి వేలాది నిరోద్యోగులను బురిడీ కొట్టించి, కోట్లు కొల్లగొట్టిన స్మార్ట్‌ యోజన వేల్ఫేర్‌ సొసైటీ  ఘరానా మోసం ఇది.    
– సాక్షి, అమరావతి

అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు మరికొన్ని చోట్లా ఈ సంస్థ వేలాది నిరుద్యోగులను మోసం చేసింది. బండారం బయటపడటంతో సొసైటీ స్థాపించిన ఇండిపూడి సుధాకర్‌ పత్తా లేకుండా పోయారు. దాంతో నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘరానా మోసం వివరాలు.. 

2018లో అప్పటి విశాఖపట్నం జిల్లా (ప్రస్తుతం అనకాపల్లి జిల్లా)లోని అనకాపల్లికి చెందిన ఇండిపూడి సుధాకర్‌ అదే జిల్లాలోని నర్సీపట్నం కేంద్రంగా ‘స్మార్ట్‌ యోజన వెల్పేర్‌ సొసైటీ’ని స్థాపించాడు. తాను చైర్మన్‌గా ఉన్న ఆ సొసైటీ పేరుతో నర్సీపట్నంలో కార్పొరేట్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. కొన్నేళ్లు కేంద్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన ప్రాజెక్టులు చేస్తున్నట్లు చెప్పాడు.

ఢిల్లీ పెద్దలకు సన్నిహితులైన స్థానిక నేతలతో ఉన్న పరిచయాలను అనుకూలంగా మలచుకొని, తనకు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అందర్నీ నమ్మించాడు. 2021లో అసలు దందాకు తెరతీశాడు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖలు,  రైల్వేలు, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ), ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ మొదలైన కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో థర్ట్‌ పార్టీ ద్వారా ఉద్యోగాలు కల్పించే కాంట్రాక్టు వచ్చినట్లు చెప్పాడు.

ఈ సంస్థల్లో తాము ఉద్యోగులను నియమిస్తామని, కేంద్ర ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందని కూడా చెప్పాడు. సొసైటీ తరపున జిల్లాకు ఓ ఇన్‌చార్జిని నియమించాడు. అప్పటికే ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించినట్టు కాల్‌ లెటర్లు కూడా చూపించాడు. ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగానికి రూ.10లక్షలు, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగానికి రూ.5 లక్షలు చెల్లించాలని రేటు పెట్టాడు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనే ఆశతో సుధాకర్‌ మాటలను చాలా మంది నిరుద్యోగులు నమ్మి డబ్బు ముట్టజెప్పారు. వారికి ఉద్యోగాలు ఇచ్చినట్లుగా కాల్‌ లెటర్లు ఇచ్చారు. కొందరితో కేంద్ర ప్రభుత్వ పథకాలపై సర్వేలు చేయించినట్టుగా డ్రామా నడిపించారు. దాంతో ఆ సంస్థను చాలామంది నమ్మారు. అప్పులు చేసి మరీ అడిగినంత చెల్లించారు. ఇలా శ్రీకాకుళం జిల్లాతో మొదలుపెట్టి విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వసూళ్లకు పాల్పడ్డారు. దాదాపు 6,500 మంది నుంచి రూ.50 కోట్ల వరకు కొల్లగొట్టినట్లు అంచనా.

డబ్బులు చెల్లించినా ఉద్యోగాలు రాకపోవడంతో కొందరు సుధాకర్‌ను నిలదీశారు. కేసు పెడతామని బెదిరించారు. వారిని సుధాకర్‌ మరోసారి మాయ మాటలతో బురిడీ కొట్టించాడు. ప్రస్తుతం ఉద్యోగానికి రానవసరం లేదని,  జీతాలు బ్యాంకు ఖాతాల్లో వేస్తామని చెప్పాడు. రెండు నెలల జీతాలు కూడా చెల్లించాడు. ఆ తరువాత నుంచి జీతాలు రాలేదు. దీంతో పలువురు నిరుద్యోగులు నర్సీపట్నంలోని సొసైటీ కార్యాలయం వద్ద ఆందోళనలు కూడా చేశారు. దాంతో సొసైటీ చైర్మన్‌ సుధాకర్‌ మెల్లగా జారుకున్నాడు.

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని  స్మార్ట్‌ యోజన వెల్ఫేర్‌ సొసైటీ కార్యాలయం   

కేసులు నమోదు
స్మార్ట్‌ యోజన వెల్ఫేర్‌ సొసైటీ, సంస్థ చైర్మన్‌ ఇండిపూడి సుధాకర్‌పై అనేకమంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమికంగా విచారించిన అనంతరం నర్సీపట్నం పోలీసులు ఐపీసీ సెక్షన్లు 420, 506 ఆర్‌/డబ్లూ 34 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుధాకర్‌పై తూర్పు గోదావరి జిల్లా పోలీసులు కూడా తాజాగా కేసు నమోదు చేశారు.

శ్రీకాకుళం జిల్లా పోలీసులూ దర్యాప్తు చేస్తున్నారు. నిరుద్యోగులను మోసం చేసిన ఉదంతాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ కేసును సత్వరం దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఇప్పటికే ఆదేశించింది. పరారీలో ఉన్న సుధాకర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు