Orissa Crime News: నా భార్యను చంపేశాను.. డయల్‌ 100కు ఫోన్‌ చేసి..

2 Jun, 2022 09:16 IST|Sakshi

అర్ధరాత్రి దాటింది. ఊళ్లన్నీ నిశ్శబ్దంగా నిద్రపోతున్న సమయంలో ఓ వ్యక్తి 100 నంబర్‌కు ఫోన్‌ చేశాడు. కాల్‌ లిఫ్ట్‌ చేసిన పోలీసులతో ‘నా భార్యను చంపేశాను. నన్ను తీసుకెళ్లండి’ అంటూ చెప్పాడు. విన్న పోలీసులకు ఓ క్షణం ఏమీ అర్థం కాలేదు. ఆకతాయిలు ఎవరైనా ఫోన్‌ చేశారా..? నిజంగానే హత్య జరిగిందా..? అని ఆలోచించారు. ఏమై ఉంటుందో అని అవతలి వ్యక్తి చెప్పిన అడ్రస్‌కు వెళ్లి చూసి నిశ్చేషు్టలయ్యారు. నిద్రపోతున్న భార్యను గొంతు నులిమి చంపేసిన ఓ ప్రబుద్ధుడు తాపీగా పోలీసులకు ఫోన్‌ చేసి లొంగిపోయాడు. 

ఎచ్చెర్ల క్యాంపస్‌: ఎచ్చెర్ల మండలం పూడివలసలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 
ఎచ్చెర్ల మండలం పూడివలస గ్రామానికి చెందిన జరుగుళ్ల రామా రావు (ఆనంద్‌ పాల్‌) భార్య నాగరత్నం(45)ను మంగళవారం రాత్రి హత్య చేశాడు. రామారావు పాస్టర్‌గా పనిచేస్తున్నారు. నాగరత్నం ఫరీదుపేట సచివాలయం ఏఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. పూడివలసలో నివాసం ఉంటూ ఫరీదుపేట రాకపోకలు సాగిస్తుంటారు.

రామారావు రోజూ భార్యను బైక్‌పై సచివాలయం వద్ద దించి సాయంత్రం పూట మళ్లీ ఇంటికి తీసుకెళ్తుంటారు. అయితే కొన్ని రోజులుగా రామారావు ఇంటి వద్దనే ఉంటున్నారు. ఆయనకు సాయంత్రం అయితే కనిపించదు. తొమ్మిదేళ్ల కిందట పెళ్లి చేసుకున్న వీరికి ఆరేళ్ల రాజ్‌కుమార్‌ పాల్‌ అనే కుమారుడు ఉన్నాడు. కొన్ని నెలలుగా ఈ దంపతుల మధ్య మనస్ఫర్థలు తలెత్తాయి. చీటి కీ మాటికీ గొడవలు పడడం ప్రారంభించారు. నాగరత్నంను కన్నవారింటికి వెళ్లవద్దని రామా రావు చెబుతుండేవాడు. అయినా ఆమె టెక్కలి సమీపంలోని నందిగాంలోని కన్నవారికి వెళ్లడంతో అప్పట్లో ఓ సారి చేయి చేసుకున్నాడు కూడా. తన మాట వినడం లేదని తరచూ ఆమెపై ఆంక్షలు పెట్టేవాడు.

దీంతో కుటుంబ కలహాలు పెచ్చుమీరాయి. మంగళవారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గంటల కొద్దీ వాదించుకున్నాక.. అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రపోతున్న భార్యను రామారావు గొంతు నులిమి చంపేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక క్రైమ్‌ స్టాపర్‌ 100కు ఫోన్‌ చేసి తాను భార్యను చంపేశానని, తనను తీసుకోపోవాలని తానే సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంశయిస్తూనే సంఘటన స్థలానికి వచ్చారు. ఇంటిలోకి వెళ్లి చూస్తే నాగరత్నం మృతదేహం మంచంపై పడి ఉంది. దీంతో హంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. శవ పంచనామా నిర్వహించి అనంతరం మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.   

పాపం కుమారుడు.. 
రాత్రి పడుకున్నప్పుడు పక్కనే ఉన్న అమ్మ ఉదయానికి మృతదేహంగా మారడంతో కుమారుడు రాజ్‌కుమార్‌ కన్నీరుమున్నీరయ్యాడు. అమ్మ కావాలంటూ గుక్కపట్టి ఏడిచాడు. ఒక్కడే కుమారుడు కావడంతో తల్లి గారాబంగా పెంచుకుంది. అమ్మ హత్యకు గురి కావడం, తండ్రి జైలుకు వెళ్లడంతో కుమారుడి పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైపోయింది. ప్రస్తుతం అతడిని అమ్మమ్మ, తాతయ్యలు తీసుకువెళ్లారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని నందిగాం తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.  ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు