దారుణం: అడిగిన డబ్బు ఇవ్వలేదని..

30 Aug, 2020 10:34 IST|Sakshi
భర్త చేతిలో హతమైన బోయ చౌడమ్మ

పామిడి(అనంతపురం జిల్లా): భర్త అడిగినప్పుడల్లా పుట్టింటి నుంచి డబ్బు తెచ్చి ఇచ్చేది భార్య. పెళ్లైన పదేళ్ల నుంచి ఇదే తంతు. ఆ డబ్బు అంతా తాగుడుకే తగలేసేవాడు భర్త. దీనికితోడు తాగివచ్చి భార్యను చితక బాదేవాడు. విసిగిపోయిన భార్య వారం క్రితమే పుట్టింటికి వెళ్లింది. దీన్ని జీర్ణించుకోలేని భర్త ఆమె పుట్టింటికే వెళ్లి ఆమెను కడతేర్చాడు. ఈ ఘటన మండలంలోని ఓబుళాపురంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలమేరకు... ఓబుళాపురంకు చెందిన వితంతువు బోయ సుంకమ్మకు ఐదుగురు కుమార్తెలు. నాల్గో కుమార్తె బోయ చౌడమ్మ (35)ను 10 ఏళ్ల క్రితం పాత గుంతకల్లుకు చెందిన బేల్దారి బోయ శ్రీనివాసులుకు ఇచ్చి పెళ్లి చేశారు. కట్న కానుకల కింద 3 తులాల బంగారం, రూ.15 వేలు ఇచ్చారు. కూతురు బాగుండాలని సుంకమ్మ పాత గుంతకల్లులో రూ. లక్షలు వెచ్చించి ఇల్లు కట్టించడంతో పాటు సామగ్రిని కూడా ఇప్పించింది.  దీనికి తోడు అప్పుడప్పుడూ ఆర్థిక సహాయం కూడా చేసేది. బోయ శ్రీనివాసులు, చౌడమ్మ దంపతులకు చరణ్‌ (7), శృతి (4) సంతానం. 

తాగుడుకు బానిసై... 
బేల్దారి బోయ శ్రీనివాసులు మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో తరచూ భార్య చౌడమ్మను డబ్బుకోసం హింసించేవాడు. విసిగిపోయిన చౌడమ్మ వారం రోజుల క్రితం భర్తపై గుంతకల్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పుట్టిల్లు ఓబుళాపురానికి వచ్చేసింది. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలు దాటాక శ్రీనివాసులు ఓబుళాపురానికి వెళ్లాడు. పిల్లలను చూద్దామని వచ్చానని భార్య, అత్తలకు చెప్పి ఇంట్లోకి వెళ్లాడు. అనంతరం అంతా నిద్రలోకి వెళ్లిన తర్వాత భార్య చౌడమ్మపై భర్త శ్రీనివాసులు కత్తితో దాడి చేశాడు. తర్వాత పారిపోతుండగా అత్త సుంకమ్మ అతన్ని అడ్డుకోవడంతో ఆమెపై కూడా కత్తితో దాడి చేసి పరారయ్యాడు.  

కన్నీరు మున్నీరైన బంధువులు 
చౌడమ్మ కుమారుడు చరణ్‌ రెండో తరగతి చదువుతున్నాడు. నాలుగేళ్ళ శృతి ఇంకా తల్లి పాలు వదల లేదు. తల్లిపాలు వదలని శృతికి తల్లిని మరిపింపజేయడం ఎలా అంటూ.. అవ్వ సుంకమ్మ , ఆమె కుమార్తెలు చౌడమ్మ మృతదేహంపై పడి కన్నీరు మున్నీరయ్యారు. దీంతో ఓబుళాపురం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతురాలి తల్లి సుంకమ్మ ఫిర్యాదు మేరకు సీఐ కే శ్రీనివాసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా