నువ్వు దేనికీ పనికిరావు అంటూ హేళన.. తట్టుకోలేక!

23 Jun, 2021 15:01 IST|Sakshi

అవమానించాడని అంతమొందించాడు

సాక్షి, సనత్‌నగర్‌: చిత్తు కాగితాలు ఏరుకునే ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. తన పట్ల అనుచితంగా వ్యవహరించడంతో పాటు తరచూ అవమానకరంగా మాట్లాడుతుండడంతో కోపోద్రిక్తుడైన యువకుడు కత్తితో పొడిచి స్నేహితుణ్ణి హతమార్చిన సంఘటన సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ ముత్తుయాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన సచిన్‌ (22), నరేందర్‌ (21) బతుకుదెరువు కోసం కొన్నాళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. రోడ్ల వెంబడి చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో తరచూ గొడవ పడుతుండేవారు.

నరేందర్‌ కాలు విరగడంతో అతని కాలులో రాడ్‌ వేశారు. దీనిని వేలెత్తి చూపిస్తూ నువ్వు దేనికీ పనికిరావు అంటూ సచిన్‌ అవమానిస్తుండేవాడు. ఇది  తట్టుకోలేని నరేందర్‌.. సచిన్‌ను ఎలాగైనా చంపాలనుకున్నాడు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మద్యం మత్తులో వీరిద్దరూ ఫతేనగర్‌ ప్రాంతంలోని ఎన్‌బీఎస్‌నగర్‌లో తారసపడ్డారు. ఒంటరిగా ఉన్న సచిన్‌ను హతమార్చేందుకు ఇదే అదనుగా భావించి అతడిపై నరేందర్‌ కత్తితో దాడి చేశాడు. ఛాతీ, గుండె భాగాల్లో పొడవడంతో తీవ్రంగా గాయపడిన సచిన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బంధువు అనిల్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: పక్కింటివాళ్లతో గొడవ.. 12వ అంతస్తు నుంచి దూకిన మహిళ

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు