రూ.3 వేలకు కొని రూ.12 వేలకు విక్రయం.. 410 కిలోల గంజాయి స్వాధీనం

24 Mar, 2022 07:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భద్రాచలం, ఏజెన్సీ ప్రాంతంలో కిలో గంజాయి రూ.3 వేల చొప్పున కొనుగోలు చేసి... అక్రమంగా ముంబైకి తరలించి రూ.12 వేలకు విక్రయిస్తున్న గంజాయి ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 410 కిలోల గంజాయి, రెండు కార్లు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్‌ ఆపరేషన్‌ టీం (ఎస్‌ఓటీ) డీసీపీ కే మురళీధర్‌తో కలిసి రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ బుధవారం వివరాలు వెల్లడించారు. 

నాగర్‌కర్నూల్‌ జిల్లా, బైరాపూర్‌ గ్రామానికి చెందిన గుడ్లనారం వెంకట్‌ నారాయణ తుర్కయాంజల్‌లోని ఏబీనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. గత మూడేళ్లుగా గంజాయి వ్యాపారం ఇతనికి పలు రాష్ట్రాల్లోని గంజాయి కొనుగోలుదారులతో సంబంధాలు ఉన్నాయి.  భద్రాచలం, ఏజెన్సీ ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ధరకు విక్రయించేవాడు. ఈ దందాలో అతడికి మండలి శ్రీనివాస్, దబ్బడి రజనీకాంత్, యాచహరం నాగరాజు సహకరించేవారు.

ముంబైకి చెందిన షాహీన్, మాజిద్‌ నుంచి ఆర్డర్‌ అందడంతో వీరు నలుగురు కలిసి ఈనెల 20న రెండు వాహనాలతో ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ సత్తిబాబు అనే వ్యక్తి నుంచి 410 కిలోల గంజాయి  కొనుగోలు చేసి వాటిని కారు లోపల సీట్ల కింద దాచిపెట్టారు. పోలీసుల తనిఖీల నుంచి త ప్పించుకునేందుకు వెరిటో కారును పైలట్‌ వా హనంగా వినియోగిస్తూ భద్రాచలం నుంచి ఓఆర్‌ఆర్‌ మీదుగా ముంబై బయలుదేరారు.  

బుధవారం దీనిపై సమాచారం అందడంతో ఎల్బీనగర్‌  ఎస్‌ఓటీ, కీసర పోలీసులు కీసర టోల్‌గేట్‌ వద్ద  వాహనాలను అడ్డగించి తనిఖీ చేశారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి 410 కిలోల గంజాయి, రెండు కార్లు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

వెంకట్‌పై పాత కేసులు కూడా.. 
ఈ కేసులో ప్రధాన నిందితుడు వెంకట్‌ నారాయణపై గతంలో రెండు పోలీస్‌ స్టేషన్లలో కేసులున్నాయి. 2019లో విజయవాడలోని పటమట పోలీస్‌ స్టేషన్‌లో గంజాయి కేసు ఉంది. నల్లగొండ జిల్లా, చిట్యాల పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన మరో గంజాయి కేసులో వెంకట్‌తో పాటు ఏఓబీ ప్రాంతానికి చెందిన సత్తి బాబు నిందితులుగా ఉన్నారు. వెంకట్‌ను పాత కేసుల్లో కూడా రిమాండ్‌కు తరలించి, కోర్టు ఎదుట హాజరుపరుస్తామని సీపీ తెలిపారు. వారిపై పీడీ యాక్ట్‌లు నమోదు చేస్తామన్నారు. 

మరిన్ని వార్తలు