హోంగార్డు రవీందర్‌ పరిస్థితి విషమం.. ఉస్మానియాకు తరలివస్తు‍న్న హోంగార్డులు.. ఉద్రిక్తత

6 Sep, 2023 11:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  జీతాల ఆలసత్వంపై ఆవేదనతో.. ఆత్మహత్యకు ప్రయత్నించిన హోంగార్డు రవీందర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రవీందర్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం అందుకున్న హోంగార్డు జేఏసీ ఆస్పత్రికి చేరుకోగా..  బుధవారం ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

రవీందర్‌కు మద్దతుగా.. ఉస్మానియా హాస్పిటల్‌కు భారీగా తరలి రావాలని హోం గార్డ్ JAC పిలుపు ఇచ్చింది. అలాగే.. రాష్ట్రవ్యాప్తంగా విధుల బహిష్కరణకు పిలుపు ఇచ్చింది. అదే సమయంలో.. హోంగార్డులు ఎవరు అఘాయిత్యాలకు ప్రయత్నించొద్దని విజ్ఞప్తి చేసింది. జేఏసీ పిలుపు మేరకు హోంగార్డులు ఉస్మానియాకు తరలి వస్తున్నారు. ఇక శాంతిభద్రతల పరిరక్షణ పేరిట ఆస్పత్రికి భారీగా చేరుకుంటున్నాయి పోలీస్‌ బలగాలు. 

సకాలంలో జీతం రావట్లేదనే ఆవేదనతో చాంద్రాయణగుట్ట ట్రాఫిక్‌పీఎస్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తు‍న్న రవీందర్‌ పెట్రోల్‌ పోసుకుని నిప్పటించుకున్నాడు.   షాహినాయ­త్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. 55 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడరు. 

అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  పాతబస్తీ ఉప్పుగూడకు చెందిన రవీందర్‌ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్‌ పీఎస్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం గోషామహల్‌లోని ఓ ఏటీఎంకు వెళ్లి తన బ్యాంకు ఖాతాను చూసుకోగా ఇంకా జీతం పడలేదు. వెంటనే గోషామహల్‌లోనే ఉన్న హోంగార్డు కమాండెంట్‌ కార్యా­లయానికి వెళ్లి అక్కడి సిబ్బందితో తన జీతం గురించి వాకబు చేశాడు. చెక్కులు సిద్ధంగా ఉన్నాయని, ఒకట్రెండు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జీతం డబ్బులు జమ అవుతాయని వారు బదులిచ్చారు. అయినప్పటికీ ఆవేదనకు గురైన రవీందర్‌ సీసాలో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. 

మరోవైపు హోంగార్డులను పర్మినెంట్‌ చేయాలనే డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. ఈ అంశంపై అధికార కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు, కవితలను హోమ్ గార్డ్ జేఏసీ నేతలు కలిశారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో హోమ్ గార్డులు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో.. ఈనెల 16, 17న పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది హోంగార్డుల జేఏసీ.

ప్రభుత్వమే ఆదుకోవాలి: ఎమ్మెల్యే రాజాసింగ్‌

హోంగార్డు రవీందర్‌ ఆత్మహత్యాయత్నం ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) మాట్లాడుతూ.. హోంగార్డ్ రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వమే అదుకోవాలి అని డిమాండ్ చేశారు. హోంగార్డులను పర్మినెంట్ చేస్తామని అసెంబ్లీలో సీఎం‌ కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. తెలంగాణలో పనిచేస్తోన్న‌ 22వేల హోంగార్డులను పర్మినెంట్ చేయాలన్నారు. మరొక హోంగార్డు రవీందర్ మాదిరి ఆత్మహత్య ప్రయత్నం చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు